దిల్ రాజు సక్సెస్ రేటు గురించి టాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే. దిల్ రాజు ఓ కథను ఓకే చేశాడు.. సెట్స్‌పైకి తీసుకొచ్చాడంటే చాలు అది హిట్ అంటూ టాక్ బయటకు వచ్చేది. కానీ ఆ మధ్య దిల్ రాజు నిర్ణయాలు బెడిసికొట్టాయి. మధ్యలో ఎన్నో సినిమా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. కుర్ర హీరోలతో నిర్మించే సినిమాలన్నీ ఫ్లాపులుగా మిగిలిపోయాయి. అలా ఫిదా సినిమాతో దిల్ రాజు మళ్లీ నిలబడ్డాడు. ఫిదా సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నాడు.
ఆ తరువాత ఎఫ్2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఏకంగా వంద కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఇక మహర్షి సినిమా సైతం భారీ హిట్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ దిల్ రాజుకు వాటా ఉంది. అలా వరుసగా బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వకీల్ సాబ్‌తో బాక్సాఫీస్‌పై దాడి చేసేందుకు రెడీ అయ్యాడు. వకీల్ సాబ్ టాక్‌తో సంబంధం లేకుండా మినిమం వంద కోట్లు కొల్లగొడుతుంది. అది పక్కా. అయితే దిల్ రాజు తాజాగా ఓ ప్రకటన చేశాడు.
నేడు (డిసెంబర్ 18) దిల్ రాజు 50వ బర్త్ డే. ఈసందర్భంగా నిన్న రాత్రి టాలీవుడ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అందులో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఇకపై తాను తిరిగి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాను.. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలని అనుకుంటున్నాను.. విద్య, వైద్యం పరంగా ఎలాంటి సాయం ఎవరికైనా కావాలంటే నేను చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో మీడియా సహకారం అందించాలని కోరాడు. మీడియా మిత్రుల్లోనూ ఎవరికైనా ఎలాంటి సాయమైన చేస్తానని, ఇప్పటి వరకు సంపాదించాను.. ఇకపై తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. మొత్తానికి దిల్ రాజు ఈ నిర్ణయంతో అందరి మనసులను దోచుకున్నాడు.