మూడు రోజులు స్నానం చేయలేదు.. ఆయనంటే అంతిష్టం అంటున్న కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్!

కర్ణాటకలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు ఆయన కుమారులు శివరాజ్ కుమార్,రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్. అయితే ఇటీవల పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాఘవేంద్ర రాజకుమార్ తన అనారోగ్యం దృష్ట్యా సినిమాలకి దూరంగా ఉన్నారు.

అయినా ఆయన కూడా కన్నడ ఇండస్ట్రీకి ఒకప్పుడు మంచి హిట్స్ ఇచ్చారు. ఇక శివరాజ్ కుమార్ గురించి మనం చెప్పుకో అక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసే సినిమాలు ఆయన ఎన్నో చేశారు. అందులో ఓం, జోగి లాంటి రికార్డు బద్దలు కొట్టే సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన ఎందరికో అభిమాన నటుడు అలాగే మంచి మనసు, మానవత్వం ఉన్న మనిషి. సమాజ సేవ చేయడంలో కూడా ముందుండే ఈ స్టార్ హీరోకి కూడా ఒక ఫేవరెట్ హీరో ఉన్నారు.

అతను అంటే శివన్నకి విపరీతమైన పిచ్చి,అభిమానము అని చెప్తూ కమల్ హాసన్ తో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు శివన్న. తన చిన్నప్పుడు కమల్ హాసన్ రాజకుమార్ ఆహ్వానం మీద ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లారంట. అప్పుడు అక్కడే ఉన్న తనని చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే తన తండ్రి రాజ్ కుమార్ తనని పరిచయం చేశారంట. అప్పుడు కమల్ హాసన్ ని శివన్న హగ్ చేసుకున్నారంట.

ఆ తర్వాత మూడు రోజులపాటు స్నానం చేయలేదని, ఆయన అంటే నాకు అంత ఇష్టం అని నవ్వుతూ చెప్పుకొచ్చారు శివరాజ్ కుమార్. కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్న ఒక స్టార్ నటుడికి కమల్ హాసన్ ఫేవరెట్ యాక్టర్ అంటే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు ఎందుకంటే కమల్ హాసన్ లోక నాయకుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే శివ రాజ్ కుమార్ త్వరలోనే తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ ద్వారా మనందరినీ కలవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.