‘డెవిల్‌’ దర్శకుడిని మార్చేశారు.. ఆవేదనతో లేఖ రాసిన నవీన్‌ మేడారం!

బింబిసార లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్‌. ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు మొదట నవీన్‌ మేడారం దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా అతడి పేరును తీసేసి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అభిషేక్‌ నామా పేరు దర్శకుడిగా పోస్టర్‌లో ఉంది.

ఇక విడుదలకు ఇంకా రెండు రోజులు ఉంది అనగా.. ఈ వివాదంపై తాజాగా నవీన్‌ మేడారం ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. డెవిల్‌ సినిమాకు ప్రాణం పోసేందుకు నేను మూడేళ్లకు పైగా కష్టపడ్డాను. మొదట కాన్సెప్ట్‌ ఆ తర్వాత స్క్రిప్ట్‌, కాస్ట్యూమ్స్‌ ఎంపిక చేసుకోవడం, లొకేషన్స్‌, సెట్స్‌ ఇలా ప్రతి అంశంలో నా ప్రమేయం ఉంది. డెవిల్‌ చిత్రాన్ని మొత్తం నేను 105 రోజుల పాటు వైజాగ్‌, కరైకుడి, హైదరాబాద్‌ లాంటి లొకేషన్స్‌ లో చిత్రీకరించాను.

కేవలం చిన్న ప్యాచ్‌ వర్క్‌ మాత్రం నేను చేయలేదు. డెవిల్‌ పూర్తిగా నా క్రియేషన్‌. నాకు ఇది కేవలం ప్రాజెక్ట్‌ కాదు, ఇది నా బిడ్డ, ఎవరు ఏమి చెప్పినా, ఇది నవీన్‌ మేడారం సినిమా. ఇన్ని రోజులపాటు నేను ఓపికతో సైలెంట్‌ గా ఉన్నాను. నా మౌనాన్ని కొందరు చేతకాని తనంగా భావించారు. ఇప్పుడు చెబుతున్నా డెవిల్‌ చిత్రం తెరకెక్కించే సమయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు.

అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే నేడు ఇలాంటి వివాదం మొదలైంది. ఇటీవల ప్రచురితమవుతోన్న కథనాల్లో చెప్పినట్లు.. సినిమా, లేదా చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. నేను తీసిన సినిమాకు దర్శకుడిగా నాకు క్రెడిట్‌ ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నా. కానీ డెవిల్‌ చిత్రం వల్ల నాకు వచ్చిన అనుభవం, ప్రతిభ, కాన్ఫిడెన్స్‌ నాతోనే ఉంటాయి. కళ్యాణ్‌రామ్‌ సార్‌ ’డెవిల్‌’ కోసం ఎంతో శ్రమించారు.

ఈ సినిమా కోసం నాకు అండగా నిలిచిన కళ్యాణ్‌రామ్‌ సార్‌కి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ’డెవిల్‌’ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం నాకు ఉంది, డిసెంబర్‌ 29, 2023న అందరూ థియేటర్లలో సినిమాను చూడాలని కోరుతున్నాను. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా నా కెరీర్‌ పైనే ఉంటుంది. నేను కొత్త సినిమాకు సంతకం చేశాను. త్వరలో వివరాలను ప్రకటిస్తాను. ధన్యవాదాలు అంటూ నవీన్‌ మేడారం రాసుకోచ్చాడు.