శాకుంతలం కోసం అన్ని కోట్ల బంగారం!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ, దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. మూవీపై ఏకంగా 80 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని కంప్లీట్ గా విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ చేశారు.

ఇక మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల దుష్యంతుడి ప్రేమకథని దృశ్య రూపంగా ఆవిష్కరించడం కోసం ఆ కాలం నాటి బ్యాక్ డ్రాప్ సెట్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచాయి. విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాని గుణశేఖర్ తెరపై ఆవిష్కరించారు. రుద్రమదేవి సినిమా తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నా గుణశేఖర్ మరల శాకుంతలం సినిమాతో తన పునరాగమనం ఘనంగా చాటాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన న్యూస్ తెరపైకి వచ్చింది.

ఈ సినిమాలో సమంత ధరించిన బంగారం మొత్తం కూడా ప్యూర్ గోల్డ్ అని సమాచారం. శకుంతల దుష్యంతుడి పాత్రతోపాటు మేనక ధరించిన ఆభరణాలు కూడా ప్యూర్ గోల్డ్ తో చేసినవి అని గుణశేఖర్ పేర్కొన్నారు. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారధ్యంలో ప్రత్యేకంగా ఈ ఆభరణాలు అన్ని కూడా తయారు చేయించినట్లు గుణశేఖర్ ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. ఈ సినిమా తెరపై అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదని గుణశేఖర్ పేర్కొన్నారు.

అందులో భాగంగానే సినిమాలో ప్రధాన పాత్రధారులు వేసిన బంగారు ఆభరణాలని ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లుగా తెలిపారు. వసుంధర జ్యువెలర్స్ వారు ఏకంగా ఏడు నెలల పాటు ఈ ఆభరణాలు తయారు చేయడానికి సమయం వెచ్చించినట్లుగా గుణశేఖర్ పేర్కొనడం విశేషం. సుమారు 14 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఈ సినిమాలో ఉపయోగించినట్లుగా గుణశేఖర్ తెలియజేశారు. మరి ఆ గ్రాండ్ లుక్ సిల్వర్ స్క్రీన్ పై ఏ స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనేది చూడాలి.