అలాంటివేం కుదరవంటున్న చిరంజీవి

Chiranjeevi-trying-to-estab
Chiranjeevi-trying-to-estab
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చారు. మెగాస్టార్ అనే పీఠం మీద ఉన్న సంగతి పక్కనపెట్టి కొత్త హీరోలానే కష్టపడుతున్నారు. అన్ని ఇండస్ట్రీల్లో అగ్ర స్థానంలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలకంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. చెప్పాలంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న కొత్త హీరోలా ఉంటున్నారు. నిత్యం జనం చర్చల్లో ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లలో ఉంటూ రెగ్యులర్ గా అభిమానులకు టచ్లో ఉంటున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా అంటే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవారు జనం. ఆయన సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకునేవారు.

అసలు చిరు బయట కనిపించడమే కష్టం. ఇక ఈవెంట్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. భారీ ఈవెంట్ అయితేనే కనబడేవారు. ఎప్పుడో ఒకసారి అభిమానులను కలిసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో కనబడుతున్నారు. సోషల్ మీడియాలో విరివిగా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. సినిమా ప్రమోషన్ల మీద విపరీతమైన శ్రద్ద పెడుతున్నారు. ఇదంతా జనాలకు గుర్తుండటానికే. వీటి వెనుక పరిస్థితులు ఏవైనా సరే చిరు ఇప్పుడు చాలా రెగ్యులర్ అయ్యారు.

ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ఎంచుకునే కథలు కూడ రెగ్యులర్ గానే ఉంటున్నాయి. మధ్యలో చేసిన ఒక్క ‘సైరా’ మినహా మిగతావన్నీ పక్కా కమర్షియల్ మీటర్లో చేసిన సినిమాలే. ఎక్కడా ప్రయోగాత్మక ప్రయత్నం లేదు. ఇప్పుడు చేస్తున్న ‘ఆచార్య’ నుండి తర్వాత చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్, మెహర్ రమేష్, బాబీలతో చేస్తున్న సినిమాలు అన్నీ కూడ రెగ్యులర్ కమర్షియల్ మీటర్ సినిమాలే. ఎవరైనా కొత్త తరహా కథలు తీసుకొస్తున్నా వినే ప్రసక్తే లేదంటూ కమర్షియల్ కథలనే తెమ్మంటున్నారు. దీన్నిబట్టి చిరు ఇప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు.