‘భోళా శంకర్’ భళా.! ఇదీ చిరంజీవి స్టామినా.!

‘వాల్తేరు వీరయ్య’ని జాక్ పాట్ అంటారు కొందరు.! క్రింజ్ కామెడీ అనీ, ఇంకోటనీ.. ఏవేవో అనేస్తుంటారు. అనేశారు కూడా.! కానీ, అనూహ్యంగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. చిరంజీవే నెంబర్ వన్.. అని చాలామంది ఒప్పుకోక తప్పని పరిస్థితి. మరీ నెంబర్ వన్ అనేయడం సరికాదేమో.. అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కడం.. అది వేరే సంగతి.

ఇక, ‘భోళా శంకర్’ విషయానికొస్తే, ‘ఆచార్య’ కంటే పెద్ద డిజాస్టర్ ఇది.! థియేట్రికల్ రిలీజ్ పరంగా చూస్తే, ‘భోళా శంకర్’ అట్టర్ డిజాస్టర్. కానీ, చిత్రంగా ఓటీటీలో ‘భోళా శంకర్’ హవా కొనసాగుతోంది. ఓటీటీలోకి వచ్చేసి రోజులు గడుస్తున్నా, ‘భోళా శంకర్’ మేనియా తగ్గడంలేదు.

కొంతమంది ‘భోళా శంకర్’ని చూసి తిట్టుకుంటున్నారు. కొంతమంది ‘బాగానే వుంది కదా..’ అంటున్నారు. ఎలాగైతేనేం, ‘భోళా శంకర్’ సినిమాని మాత్రం చూస్తున్నారు. అదీ మళ్ళీ మళ్ళీ. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వుంటున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.

దీంతోపాటుగా, యూ ట్యూబ్ సహా, పలు చోట్ల అందుబాటులో వున్న ఒరిజినల్ వెర్షన్ ‘వేదాలం’ కూడా మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నారట. దాన్ని చూసి దీన్ని తిట్టేవారు, చిరంజీవిని పొగిడేవారు.. ఇలా సోషల్ మీడియాలో అయితే రచ్చ కొనసాగుతోంది.

థియేట్రికల్ బిజినెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదనీ, ఓటీటీ బిజినెస్ చాలా గట్టిగా అయ్యిందనీ.. విడుదలకు ముందే ఓ టాక్ బయటకు వచ్చింది. అదే నిజం.! ఆ లెక్కన నిర్మాత హ్యాపీ.! హీరో ఎలాగూ హ్యాపీ.! మరి, బీపీ ఎవరికి.? థియేట్రికల్ బిజినెస్‌ని నమ్ముకున్నోళ్ళకి మాత్రమే.