‘చిరంజీవి 156’ పాటతో సెలబ్రేషన్స్‌ షురూ…

మెగాస్టార్‌ చిరంజీవి (156) హీరోగా నటిస్తున్న 156వ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మంగళవారం పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ వీడియో విడుదల చేసి తెలిపింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ ఇచ్చారు. సురేఖ, వి.వి.వినాయక్‌ ఛోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కీరవాణి మాట్లాడుతూ ‘’ఏ సినిమా అయినా రికార్డింగ్‌తో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ విధానాన్ని పునరుద్దిస్తూ సెలబ్రేషన్‌ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెట్టాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ఓ బలమైన కథను తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు దర్శకుడు’’ అని తెలిపారు.

గేయ రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘అరుదైన కథతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకొస్తాం’’ అని చెప్పారు.

చిరంజీవికి ఇది 156వ చిత్రం కాగా, యు.వి సంస్థకు 14వ సినిమా. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని అత్యంత బడ్జెట్‌తో నిర్మించనున్నారు, ఇప్పటి వరకు మెగాస్టార్‌ చిరంజీవికి హై బడ్జెట్‌ మూవీ ఇది. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌. ఏఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌. కీరవాణి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఎడిటర్లుగా పనిచేస్తున్నారు.