రామ్‌ – జాన్వీలతో ‘జగదేకవీరుడి’కి సీక్వెల్‌.. మెగాస్టార్ చిరంజీవి మనోగతం!

సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రాజీవ్‌ మసంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు చిరు సమాధానం కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామ్‌ చరణ్‌ ఈ మధ్య ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సాన తో ఒక మూవీ ప్రారంభించాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటిస్తోంది. అయితే మూవీ లాంచ్‌ ఈవెంట్‌లో జాన్వీతో మాట్లాడుతున్నప్పుడు కొంచె భావోద్వేగంగా అనిపించింది. అమెని చూస్తున్నప్పుడు శ్రీదేవి గుర్తుకువచ్చింది. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది.

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సీక్వెల్‌ తీస్తే చూడాలని ఉంది’ అంటూ చిరు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అలాగే ‘హనుమాన్‌’ ఫేమ్‌ తేజ సజ్జాని ప్రశంసించాడు. తేజాను చూపిస్తూ 25 ఏళ్ల క్రితమే బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడని, ‘ఇంద్ర’ చిత్రంలో నటించాడని, ఇప్పుడు ‘హనుమాన్‌’ సినిమాలో నటించి అందరి ప్రేమలను పొందాడని కొనియాడారు.

అతడికి టాలీవుడ్‌ లో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేదని, తనని అభిమానిస్తూ, తన చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని హీరో అయ్యాడని, ‘హనుమాన్‌’ తో తనని తాను నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. ‘నేను కూడా ‘హనుమాన్‌’ పై ఎప్పుటి నుంచో సినిమా చేయాలనుకున్నానని, కానీ కుదరలేదని.. తన ప్రయాత్నానికి ముందే తేజా చేసి చూపించాడని చిరు మెచ్చుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నాడు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో త్రిష కథనాయికగా నటిస్తోంది.