సంక్రాంతి పండగ నాడు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అప్పుడు ఐదో సినిమా రవితేజ నటించిన ‘ఈగల్’ కూడా విడుదలవ్వాల్సి వుంది. కానీ నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ సినిమా నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చి ‘ఈగల్’ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పారు. అప్పుడు పోటీ లేకుండా చేస్తామని కూడా ఆ సినిమా నిర్మాతకి హామీ ఇచ్చారు.
తరువాత ‘ఈగల్’ ఫిబ్రవరి 9న విడుదల చెయ్యాలని నిర్ణయించుకొని ఆ తేదీని ప్రకటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ. తరువాత సందీప్ కిషన్ తన ‘ఊరి పేరు భైరవకోన’ అనే సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాకి నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు విఐ ఆనంద్. ఇది ఒక ఫాంటసీ నేపథ్యంలో తీసిన సినిమా.
ఈ సినిమా ప్రచారాలు కూడా మొదలెట్టేసారు, ఫిబ్రవరి 9 తప్పితే మాకు ఇంకా వేరే తేదీ లేదు విడుదల చెయ్యడానికి అని కూడా ఒక ప్రచార ఈవెంట్ లో చెప్పేసాడు సందీప్ కిషన్. ఇది తెలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని రోజుల క్రితం, నిర్మాతల మండలికి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఒక లేక రాశారు. అందులో తన సినిమా ‘ఈగల్’ విడుదలప్పుడు పోటీ లేకుండా చేస్తామని మాటిచ్చారు, ఆ మాట నిలబెట్టుకోండి అని చెప్పారు.
అందుకోసమని ఈరోజు నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా విడుదల వాయిదా వేసుకోమని ఆ సినిమా నిర్మాతకి చెపుతారని సమాచారం. . అతను కూడా ఇంకో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని కూడా తెలిసింది.