శ్రీదేవి బయోపిక్‌కు అంగీకరించను : భర్త బోనీకపూర్‌

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రానుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే! తాజాగా దీనిపై ఆమె భర్త బోనీ కపూర్‌ స్పందించారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘మైదాన్‌ ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్‌ గురించి మాట్లాడారు. తాను బతికుండగా శ్రీదేవి బయోపిక్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. . ఆమె వ్యక్తిగత జీవితం ప్రపంచానికి తెలియడం ఇష్టం లేదన్నారు. ’శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా.. ఆమె ఇంగ్లిష్‌ రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శక నిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లీషు రాని గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించింది. సినిమా ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే! నా భార్య చాలా ప్రైవేట్‌ పర్సన్‌. ఆమె వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితమంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్‌ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను’ అని బోనీ కపూర్‌ స్పష్టం చేశారు.

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన శ్రీదేవి హీరోయిన్‌ గా అగ్ర హీరోలు అందరితో నటించింది. తన నటనతో అన్ని భాషల్లోని సినీ ప్రియులను అలరించి ఇండస్టీల్రో తనకంటూ కొన్ని పేజీని లిఖించుకొంది. ఈ అగ్ర కథానాయిక జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్‌, శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌‘ పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.