బింబిసార 2.. మరో దర్శకుడా?

కళ్యాణ్ రామ్ కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిత్రం బింబిసార. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి సెన్సేషన్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. సోషియో ఫాంటసీ స్టొరీ లైన్ తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. చరిత్ర నుంచి ప్రస్తుతకాలంలోకి వచ్చిన బింబిసార అనే చక్రవర్తి గర్వాన్ని వదిలేసి తనలోని మానవత్వాన్ని ఎలా పెంచుకున్నాడు అనే స్టొరీ లైన్ తో ఈ సినిమాని ఆవిష్కరించి సూపర్ హిట్ కొట్టారు.

దర్శకుడు మల్లిడి వశిష్టకి ఇది మొదటి సినిమా అయినా కూడా ఎలాంటి తడబాటు లేకుండా అద్బుతంగా కథని ఆవిష్కరించారు. తాను ఎలా చెప్పాలని అనుకున్నారో అలా తెరపై చూపించారు. ఈ మూవీతో దర్శకుడు ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు. ఇక కళ్యాణ్ రామ్ కి కూడా ఈ మూవీ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే బింబిసార 2 కూడా ఉంటుందని గతంలో కళ్యాణ్ రామ్ దర్శకుడు మల్లిడి వశిష్ట కన్ఫర్మ్ చేశారు.

ఇక తాజాగా ఈ సినిమా కథ విషయంలో కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ట మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన అనిల్ పాడూరిని దర్శకత్వంలో బింబిసార 2 చేయాలని కళ్యాణ్ రామ్ డిసైడ్ అయ్యాడంట. అనిల్ పాడూరి మొదటి సినిమాకి విఎఫ్ఎక్స్ హెడ్ గా పనిచేశారు.

దీంతో అతనికి సినిమాపై మంచి విజన్ ఉంటుందని భావించి కళ్యాణ్ రామ్ దర్శకత్వ బాద్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యాడంట. ఇక మల్లిడి వశిష్ట కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు అనే మాట వినిపిస్తుంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ హిస్టోరికల్ కథాంశంతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడంటా. ఈ నేపధ్యంలో బింబిసార2 నుంచి అతను మనస్పూర్తిగానే కళ్యాణ్ రామ్ కి చెప్పి తప్పుకున్నాడని టాక్ నడుస్తుంది.