బెంగాల్లోనూ కాస్ట్‌ కౌచింగ్‌… దర్యాప్తు చేపట్టాలన్న బెంగాలీ నటి రితాభరీ చక్రవర్తి

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. దాంతో పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నటి రితాభరీ చక్రవర్తి కోరారు.

ఈ మేరకు ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇక్కడ కూడా జస్టిస్‌ హేమా కమిటీ వంటి దానిని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని అభ్యర్థించారు. రితాభరీ.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి. లైంగిక వేధింపుల కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని తన పోస్టులో పేర్కొన్న ఆమె.. దీనిని ట్యాగ్‌ చేశారు. తనతో పాటు తనతోటి వారికి కొందరు నటులు, దర్శకనిర్మాతల చేతిలో భయానక అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.

అయితే ఆమె ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇలా వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తులు.. బెంగాల్‌ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో ఎలాంటి సిగ్గులేకుండా పాల్గొనడం ఆశ్చర్యపరిచిందన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ కొన్నేళ్లపాటు శ్రమించి ఒక నివేదిక రూపొందించింది.

ఇందులో ఎన్నో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. హేమ కమిటీ రూపొందించిన నివేదిక అంతటా చర్చకు దారితీసింది.