Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలుస్తూ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
సంక్రాంతి బరిలో నిలిచిన ‘డాకు మహారాజ్’ మొదటిరోజు నుంచే అభిమానులను ఆకట్టుకుంటూ సంచలన వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే 56 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో ఈ సినిమా సత్తా చాటుతూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.
బాలయ్య పవర్ఫుల్ పాత్రలో కనిపించిన ఈ సినిమాలో, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ వంటి కథానాయికలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రిల్‌తో కూడిన కథ, శక్తివంతమైన డైలాగులు, థమన్ అందించిన ఎనర్జిటిక్ సంగీతం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి.
చిత్రం విడుదలైన నాలుగు రోజులకే భారీ వసూళ్లు సాధించడం విశేషమని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అలాగే ఈ సినిమా తమిళంలో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పండుగలా మారిన ‘డాకు మహారాజ్’ తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని అంచనా.
‘సితార ఎంటర్టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం, బాలకృష్ణకు మరొక భారీ హిట్ తీసుకురావడమే కాకుండా, సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నింటికంటే ముందంజలో కొనసాగుతోంది. ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే దిశగా ఈ సినిమా దూసుకుపోతోందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.