అతిలోకసుందరి శ్రీదేవి గురించి తెలియని వారంటూ ఉండరు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఎన్నో సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ వందల సంఖ్యలో సినిమాలలో నటించిన శ్రీదేవి బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.
మళ్లీ 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ముంబైలోని హోటల్ గదిలో శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ ఆమె నటించిన సినిమాలో చూసి ఎంతోమంది అభిమానులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలా శ్రీదేవి మరణించి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తోంది.
ఇదిలా ఉండగా శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమా విడుదలై అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో శ్రీదేవికి నివాళులు అర్పిస్తూ ఆమె ఈ సినిమాలో కట్టుకున్న చీరలను వేలానికి పెట్టనున్నట్లు సినిమా దర్శకుడు గౌరీ షిండే స్వయంగా ప్రకటించాడు. ఈ వేలంలో వచ్చిన డబ్బుతో బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. ఇలా శ్రీదేవి కట్టిన చీరలు అమ్మి అమెకు నివాళులు అర్పించటానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.