మ్యూజిక్ వరల్డ్ లో టాప్ రెమ్యునరేషన్ అతనిదే..

ఇప్పుడు సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంతో మ్యూజిక్ డైరెక్టర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. కథ ఎంత గొప్పగా ఉన్నా, సంగీతం ప్రేక్షకుల హృదయాన్ని తాకకపోతే సినిమాకు అది పెద్ద మచ్చ లాంటిది. అందుకే అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరించే మ్యూజిక్ అందించగల సంగీత దర్శకులకు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుతోంది. ఈ కోవలో ఇప్పుడు టాప్ ప్లేస్ అనిరుద్ రవిచందర్‌దే.

తమిళ పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ అంటే రిజర్వేషన్ తప్పనిసరి. ‘జైలర్,’ ‘లియో’ వంటి సినిమాలు అతని సంగీతంతోనే హిట్ అయ్యాయని టాక్. ఇక తెలుగులో ‘దేవర’తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా కథలకు, హీరోల సాలిడ్ ఎలివేషన్లకు అనిరుద్ సంగీతం సరిగ్గా సరిపోతున్నది. సరిగ్గా ఈ క్రమంలోనే అనిరుద్ రెమ్యునరేషన్ పరంగా తన స్థాయిని పెంచుకుంటూ ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలుస్తున్నాడు.

ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ సినిమాకు 10 కోట్ల వరకు తీసుకునే అగ్రగామి సంగీత దర్శకుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు అనిరుద్ సినిమాకు రూ. 15 కోట్లకుపైగా ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. షారుఖ్ ఖాన్‌కు ‘జవాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన అనంతరం, బాలీవుడ్‌లో కూడా అనిరుద్‌కి భారీ క్రేజ్ వచ్చింది. దీంతో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ఆయన చేతిలోకి వెళ్లే అవకాశముంది.

అనిరుద్ నుంచి వచ్చే ప్రతి సాంగ్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి సాంగ్ ట్రెండ్ కావడం, సినిమాపై అంచనాలు పెరగడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అనిరుద్‌నే తమ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.