మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. వారసత్వం అనేది కేవలం కొడుకు వరకు పరిమితం కాదని, కూతురుని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ తరహా ఆలోచనల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
“వారసుడు అంటే కొడుకే అవుతాడా? కూతురు వారసురాలు కాదా?” అంటూ శ్యామల ప్రశ్నించారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, వారసత్వ హక్కు విషయంలో జెండర్ డిఫరెన్స్ లేకుండా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు. చిరంజీవి కుటుంబాన్నే చూస్తే ఉపాసన వంటి మహిళలు పెద్ద సంస్థలను సమర్థంగా నడుపుతున్నారని ఆమె గుర్తు చేశారు.
అంతేకాదు, చిరంజీవి ఇంట్లో ఉన్న మహిళలు కూడా వ్యాపార రంగంలో, సామాజిక సేవలో ఎంతో ముందున్నారు. కానీ, వారసత్వం విషయానికి వస్తే ఇప్పటికీ కొడుకులనే ప్రధానంగా చూడటం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదని, కానీ సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి ఆలోచనలను తొలగించుకోవాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలతో మెగాస్టార్ వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నా? అందులో అసలు అర్థం ఏమిటి? అనే దానిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలకు మెగస్టార్ మళ్ళీ ఏమైనా సమాధానం ఇస్తారో లేదో చూడాలి.