సినిమా విజయాలతో ముందుకుసాగుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి రాజకీయ అరంగేట్రంపై పుకార్లు ఇటీవల వేగంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలతో ఉన్న బన్నీ సంబంధాలు, గత ఎన్నికల సమయంలో వైసీపీ నేత శిల్పా రవికి బన్నీ మద్దతు ఇవ్వడం పలు చర్చలకు దారితీసింది. అయితే, ఇది మెగా మరియు అల్లు అభిమానుల మధ్య గందరగోళానికి కారణమైంది.
ఇటీవల ఈ పుకార్లపై స్పష్టతనిచ్చేందుకు అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో “అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి రావడం గురించి జరుగుతున్న వార్తలు పూర్తిగా అసత్యం” అని పేర్కొన్నారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని, ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక చానెల్స్‌ను మాత్రమే సంప్రదించాలని కోరారు. ఈ ప్రకటనతో బన్నీ అభిమానులు ఊరట చెందారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూర్తిగా తన సినిమాలపై దృష్టి సారించారు. ‘పుష్ప 2’ విజయం బన్నీ క్రేజ్‌ను దేశవ్యాప్తంగా మరింత పెంచింది. ఈ విజయాన్ని అభిమానులతో పంచుకునేందుకు పలు నగరాల్లో విజయయాత్ర చేయాలని బన్నీ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని సక్సెస్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే, తన తర్వాతి సినిమాల విషయంలో బన్నీ మరింత పెద్ద ప్రాజెక్ట్స్‌కు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేయనున్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి చర్చలు జరుపుతున్నారు. సినిమాల మీదే దృష్టి పెట్టిన బన్నీ, రాజకీయాలు అనేవి ప్రస్తుతం తన ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు.