ఆగస్టు నెలలో వచ్చిన చిన్న చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ‘ఆయ్’ మరియు ‘కమిటీ కుర్రోళ్ళు’ చిన్న చిత్రాలుగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అదే ట్రాక్ లో రాబోతున్న సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఇది మరొక కామెడీ ఎంటర్టైనర్ కావడంతో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ముఖ్యంగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై హైప్ పెరగడానికి మరో కారణం అల్లు అర్జున్ సపోర్ట్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ హాజరై తన సపోర్ట్ ప్రకటించడమే కాకుండా, తన స్పీచ్ తో మరింత ఉత్సాహాన్ని పెంచాడు.
అల్లు అర్జున్ ఈ వేడుకలో చేసిన ఉపన్యాసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇష్టమైన వారి కోసం తాను ఎప్పటికప్పుడు ముందుకొస్తానని చెప్పిన బన్నీ, రావు రమేష్ సహా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రశంసించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బన్నీ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో ఎందరో ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది.
ముఖ్యంగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ పై ఈ ప్రసంగం మరింత ఆసక్తి కలిగించిందని చెప్పవచ్చు. ట్రైలర్ ద్వారా ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక కామెడీ మూవీగా రూపొందింది. రావు రమేష్ అకౌంట్ లో అకస్మాత్తుగా డబ్బులు క్రెడిట్ అవడం, ఆ పరిణామాల చుట్టూ కథ నడవడం ఆసక్తికరంగా ఉంటుందట. ఇందులో కామెడీ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని ట్రైలర్ తో ఒక నమ్మకాన్ని కలిగించారు. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కామెడీ చిత్రాలకు మంచి సపోర్ట్ అందిస్తున్నారు. దీంతో, ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ కూడా అదే లైన్లో విజయం సాధించవచ్చని అనిపిస్తోంది.
ఈ సినిమా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందింది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
తబితా సుకుమార్ సమర్పణలో తొలి చిత్రంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. దర్శకుడు సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఈ చిత్రానికి ముఖ్య అతిథులుగా రావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక సినిమాను ఈ నెల 23న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.