అల్ల‌రోడి సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడిగా తెలుగు పరిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన న‌రేష్ అల్లరి అనే సినిమాతో అల్ల‌రి న‌రేష్‌గా మారాడు. తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని తన ఖాతాలో వేసుకున్న అల్ల‌రి న‌రేష్ ఆ త‌ర్వాత ఎన్నో కామెడీ చిత్రాలు చేశాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో మెప్పించిన అల్లరి న‌రేష్ కెరీర్‌లో 50 చిత్రాలు పూర్తి చేశారు. అల్ల‌రి న‌రేష్ చిత్రాల‌లో కామెడీతో పాటు ఎమోష‌న్ ఉంటుంది. ఏ పాత్ర‌నైన ఇట్టే పండించ‌గ‌ల అల్ల‌రి న‌రేష్‌కు శంభో శివ శంభో చిత్రం మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇందులో అల్ల‌రోడు తన న‌ట విశ్వ‌రూపం చూపించి వావ్ అనిపించాడు,

కామెడీతో కిత‌కిత‌లు పెట్టిన అల్ల‌రి న‌రేష్ ఇప్పుడు సీరియ‌స్ పాత్ర‌లే చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుకు కార‌ణం ఈ మ‌ధ్య కాలంలో అత‌నికి స‌రైన స‌క్సెస్ రాక‌పోవ‌డం. న‌రేష్ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ఎప్పుడు పోతుందో కూడా ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. ఇలా చేస్తే జ‌నాలు కూడా త‌న‌ని మ‌ర‌చిపోతారేమోనని భావించిన అల్ల‌రి న‌రేష్ సంచల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఫిలిం న‌గ‌ర్ టాక్.

ఇక నుండి కామెడీ పాత్ర‌ల‌కు గుడ్ బై చెప్పి కేవ‌లం సీరియ‌స్ పాత్ర‌ల‌కు సంబంధించిన స్క్రిప్ట్‌లే వినాల‌ని అల్ల‌రోడు నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఇప్పుడు తాను చేస్తున్న నాంది చిత్రం అలాంటి జాన‌ర్‌లోనే తెర‌కెక్క‌గా, ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ , వీడియోలు మూవీపై చాలా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. కాని అల్ల‌రి న‌రేష్ కామెడీ చిత్రాల‌కి చాలా అడిక్ట్ అయిన ప్రేక్ష‌కులు ఇప్పుడు ఆయ‌న న‌టించిన సీరియ‌స్ మూవీస్ చూడాలంటే కాస్త ఇబ్బంది ప‌డ‌తారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నిర్ణ‌యం కాస్త మార్చుకుంటే బాగుంటుందేమో అని కొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌.