Naga Chaitanya Divorce: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అయితే, ఈ అంశంపై నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని, ఎంతో ఆలోచించి, పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. వ్యక్తిగత విషయాలు గాసిప్‌గా మారడంపై అసహనం వ్యక్తం చేస్తూ, తమ జీవితాన్ని వినోదంగా చూడొద్దని ఆయన సూచించారు.
నాగచైతన్య మాట్లాడుతూ, విడాకుల అంశంపై అనవసరంగా ఊహాగానాలు నడిపారని, తనను తప్పుబట్టేలా కథనాలు రావడం బాధ కలిగించిందని చెప్పారు. “ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. నాపై నెగెటివ్ కామెంట్లు చేయడాన్ని ఇకనైనా ఆపాలని కోరుకుంటున్నా” అని స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీ గురించి కూడా చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు ప్రమోషన్ చేయడం ఈ రోజుల్లో తప్పనిసరి అయిందని, అందుకే తాను కూడా కొంత ఆలస్యంగా పీఆర్ వ్యవస్థలోకి వచ్చానని చెప్పారు. ఒకప్పుడు సినిమా పూర్తయ్యాక ఇంటికెళ్లిపోయేవాడినని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని వివరించారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో పీఆర్ సేవలు లేకుండా సినిమాలను సక్సెస్ చేయడం కష్టమని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. నెలకు కనీసం రూ.3 లక్షలు ఖర్చు పెట్టకపోతే సరైన ప్రచారం జరగదని అన్నారు. అయితే, ఈ వ్యవస్థను కొందరు తప్పుగా ఉపయోగించుకుంటున్నారని, నిజమైన టాలెంట్‌కు అవకాశమివ్వకుండా ఇతరులను నెగెటివ్ ప్రచారంతో కిందికి లాగాలని చూస్తున్నారని మండిపడ్డారు. “ఇతరులను ఇబ్బంది పెట్టడం కన్నా, ఎదగడంపై దృష్టి పెట్టడమే మంచిది” అని సూచించారు.