Akkineni Akhil: యువ హీరో అక్కినేని అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో ఈనెల 26న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున మంగళవారం తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
ఇప్పుడు వీరి వివాహం ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అఖిల్, నాగ చైతన్య పెళ్లిళ్లు ఒకేసారి చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై నాగార్జున తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి వివాహాలకు కొంత సమయం ఉంటుందని స్పష్టం చేశారు.
అఖిల్ వివాహం వచ్చే ఏడాది ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘అఖిల్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతనికి కాబోయే భార్య జైనబ్ ఒక మంచి, అందమైన అమ్మాయి. వారు ఇద్దరూ తమ జీవితాలను కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకు మేమంతా సంతోషిస్తున్నాం. వీరి వివాహం 2025లో జరుగుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వివరించారు.