15న విడుదలకు సిద్ధంగా ‘అఘోరి’

బుల్లితెర నటుడు సిద్ధు సిధ్‌ కథానాయకుడిగా మారి..హీరోగా నటించిన ‘అఘోరి’ చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఇందులో షాయాజీ షిండే వైవిధ్యభరితమైన పాత్రను పోషించారు. పీవీఆర్‌ పిక్చర్స్‌ విడుదల చేసే ఈ చిత్రాన్ని మోషన్‌ ఫిల్మ్‌ పిక్చర్స్‌ ఐఎన్‌సీ పతాకంపై నిర్మాత సురేష్‌ కే మీనన్‌ నిర్మించారు. డీఎస్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు.

శృతి రామకృష్ణన్‌ హీరోయిన్‌గా నటించగా, ఇతర పాత్రలను మైమ్‌ గోపి, డార్లింగ్‌ మదన గోపాల్‌, రియామికా, మాధవి, వెట్రి, కార్తీ, శరత్‌, డిజైనర్‌ భవన్‌ తదితరులు పోషించారు. వసంత్‌ ఛాయాగ్రహణం అందించగా, ఫోర్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ పేరుతో నలుగురు సంగీత దర్శకులు సంగీత స్వరాలను సమకూర్చారు.

ఈ చిత్ర కథను దర్శకుడు డీఎస్‌ రాజ్‌కుమార్‌ వివరిస్తూ… ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఆరు నుంచి అరవైయేళ్ళ వారు చూసేలా అన్ని రకాల కమర్షియల్‌ ఫీచర్లతో రూపొందించాం. ‘అఘోరి’గా షిండే అద్భుతంగా నటించారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో వేసిన భారీ సెట్లలో అఘోరీలతో ఉండే సన్నివేశాలను భీతిగొల్పేలా తెరకెక్కించాం.

సినిమాలో గ్రాఫిక్స్‌ ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచేలా ఉంటాయి. తెలుగులో ‘సహా’ చిత్రంలో నటించిన జక్కుల్లా బాబు ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ అవార్డు స్వీకరించిన శృతి రామకృష్ణన్‌ హీరోయిన్‌గా నటించారని వివరించారు.