హేమ కమిటీ రిపోర్టు చూసి షాకయ్యా: మహిళల రక్షణకు సరైన సంస్థలు రావాలన్న శ్రద్ద

ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఆగాలంటే పటిష్ఠమైన సంస్థలు రావాలని బాలీవుడ్‌ నటి శ్రద్దా శ్రీనాథ్‌ (Shraddha Srinath) అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణం గురించి చెప్పారు. అలాగే హేమ కమిటీని ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను మలయాళ చిత్ర పరిశ్రమలోనూ పనిచేశాను. కానీ, నేనెప్పుడూ వేధింపులు ఎదుర్కోలేదు. సురక్షితంగా ఉన్నాను. పార్టీలకు వెళ్లి ఇంటికి వస్తున్నప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉండేదాన్ని. డ్రైవర్‌ ఎటు చూస్తున్నాడో ఎప్పుడూ అప్రమత్తతతో వ్యవహరించేదాన్ని. ఎనిమిదేళ్ల వయసు నుంచే అలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా.

అందుకే నాకు ఎప్పుడూ పరిశ్రమలో వేధింపులు ఎదురుకాలేదు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సినిమా సెట్‌లో మహిళలకు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండవు. అలాంటి కనీస అవసరాలు కచ్చితంగా ఉండేలా చూడాలి. హేమ కమిటీ రిపోర్ట్‌ చూసి షాకయ్యాను. సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు వాటిని ఎవరితో చర్చించాలో తెలియక ఆగిపోతున్నారు. పరిశ్రమలో మహిళలపై వేధింపులు ఆగాలంటే పటిష్ఠంగా పనిచేసే సంస్థలు రావాలని శ్రద్ధ అభిప్రాయపడ్డారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమకమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను బయటపెట్టారు. అన్ని ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఓ కమిటీని ఏర్పాటుచేయాలని కొందరు నటీనటులు కోరుతున్నారు.