సినీ నటుడు జగపతి బాబు కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్ ను కొందరు బెదిరిస్తున్నారు. ఫోన్లు చేసి చంపేస్తామంటూ ఆయన్ను బెదిరిస్తున్నారు.
జగపతి బాబు సోదరుడు హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నివాసముంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బేగంపేట వద్ద ఉన్న ఓ స్థలం విషయమై శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి ఇప్పటికి 25 బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది.
జగపతి బాబు సోదరుడితో పాటు ఆయన కొడుకును కూడా చంపేస్తామంటూ శ్రీనివాస్ బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే.. తనను బెదిరించేది బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి అయి ఉంటాడు అని యుగేంద్ర కుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే యుగేంద్ర కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తనను, తన కుమారుడిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.