బిగ్ బాస్ విన్న‌ర్‌కు క్రేజీ ఆఫ‌ర్.. కీల‌క పాత్ర‌లో కామెడీ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నఅభిజీత్

కరోనా వ‌ల‌న వినోదం లేక విసిగిపోతున్న ప్రేక్ష‌కుల‌కు ప‌సందైన వినోదం అందించిన రియాలిటీ షో బిగ్ బాస్. బుల్లితెర‌పై ఈ షో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లోను బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజుల క్రితం తెలుగులో సీజన్ 4 పూర్తి చేసుకున్న ఈషోకు భారీగా ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. ఇందులో పాల్గొన్న ప్ర‌తి ఒక్క కంటెస్టెంట్ కూడా జ‌నాల దృష్టిని ఆక‌ర్షించాడు. ఇక విన్న‌ర్‌గా నిలిచిన అభిజీత్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం, త‌న‌కు స‌పోర్ట్ చేసిన వారిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం వంటివి చేస్తున్నారు.

అయితే బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సోహైల్, మెహ‌బూబ్, మోనాల్‌, దివికు సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చాయ‌ని ఇప్ప‌టికే వార్త‌లు రాగా, తాజాగా అభిజీత్ కూడా క్రేజీ ఆఫ‌ర్ అందుకున్నాడ‌ని టాక్. మేట‌ర్‌లోకి వెళితే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లు కాగా, వ‌రుణ్ తేజ్, వెంక‌టేష్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం అభిజీత్‌ని తీసుకోవాల‌ని అనీల్ రావిపూడి భావిస్తున్నాడ‌ట‌.

బిగ్ బాస్ ఫినాలే రోజు హౌజ్‌లోకి అడుగుపెట్టిన అనీల్ రావిపూడి టాప్ 5 కంటెస్టెంట్స్ మేన‌రిజాన్ని ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాక త‌న‌తో పాటు వ‌చ్చిన వారికి సినిమా ఛాన్స్ ఇస్తాన‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. సోహైల్ కాస్త టెంప్ట్ అయిన మిగ‌తా వారెవ‌రు లొంగ‌లేదు. అయితే ఇప్పుడు అనిల్‌ రావిపూడి చిత్రంలో కీలకపాత్ర కోసం అభిని ఎంపిక చేసుకున్నాడ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.