నిజంగా దేశమంతా ఎదురుచూస్తున్న చిత్రం అంటే అది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న SSMB29. కానీ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ లెజెండరీ నటుడు నానా పాటేకర్‌కు అడిగినట్లు బాలీవుడ్ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది. ఆసక్తికరంగా, పాత్రకు భారీ రెమ్యూనరేషన్ – దాదాపు 20 కోట్లు ఆఫర్ చేసినా, నానా పాటేకర్ డైరెక్ట్ గా “నో” చెప్పినట్టు తెలుస్తోంది. ఇది నిజం అయితే, ఇది ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మిస్సయ్యే అవకాశం.
ఇటీవలే నానా పాటేకర్ నటించిన హౌస్ ఫుల్ 5 సినిమాకు తీవ్ర విమర్శలు వచ్చాయి. కథా అనుకున్నంత స్థాయిలో లేదు , స్క్రీన్‌పై హాస్యం లేకుండానే బూతులతో నింపిన ఈ చిత్రంలో నటించడం అతడి క్రేజ్‌కు తగ్గ పని కాదనే విమర్శలే వినిపిస్తున్నాయి. అలాంటి సినిమాకు ఓకే చెప్పిన నానా, సిల్వర్ స్క్రీన్ మాస్టర్మైండ్ రాజమౌళి ఆఫర్ చేసిన పాత్రను వదులుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా ఇది మహేష్ బాబు సినిమాలో కీలకమైన తండ్రి పాత్ర అని ఇండస్ట్రీ టాక్.
ఇది అధికారికంగా బయటకి రాలేదు గనక, నిజంగా నానా పాటేకర్ రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈయన గతంలో తెలుగు పరిశ్రమలో చాలా తక్కువగా కనిపించినా, రజనీకాంత్‌తో కాలా చిత్రంలో విలన్‌గా మెరిశారు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో మరోసారి సౌత్‌కు రీ ఎంట్రీ ఇచ్చి ఉంటే, అది మరో హైలైట్ అయ్యేది. కానీ ఆ అవకాశం పక్కన పెట్టడం ఖచ్చితంగా విచారకరం.
ఇక అదే సమయంలో మరో ఆసక్తికర అప్డేట్ కూడా బయటకొచ్చింది. నటుడు మాధవన్, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఫైనల్ అయ్యారని వార్తలొస్తున్నాయి. మహేష్, మాధవన్, పృథ్వీరాజ్… ఇలా స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటే, సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నది క్లారిటీగా కనిపిస్తోంది. ఇక నానా పాటేకర్ నిర్ణయం వల్ల మిస్ అయిన ఘనత ఎవరిది అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలింది.