మన దేశంలో చాలామంది ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావిస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సి.హెచ్.సి.ఎల్ 2025 ప్రకటనను వెల్లడించింది. వేర్వేరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇంటర్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3131 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వాళ్ళు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి అని చెప్పవచ్చు.
18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 1999 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం మధ్య పుట్టిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యంగులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19900 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వేతనం లభించనుంది.
అర్హత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది. టైర్ 1 పరీక్షకు 200 మార్కులు కేటాయించగా టైర్ 2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారని సమాచారం అందుతోంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. జులై 18 ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.