కూల్ డ్రింక్ కంటే అన్నమే డేంజర్ అట

కూల్ డ్రింక్ ఆరోగ్యానికి హానికరం అని రకరకాల వాదనలు ఉన్నాయి. కూల్ డ్రింక్ లలో పురుగుమందుల అవశేషాలు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కూల్ డ్రింక్స్ తాగితే ఊబకాయం లంటి సమస్యలేకాకుండా ఇతర రోగాలు కూడా వస్తాయని చెబుతారు. కానీ అంతటి డేంజర్ అనుకుంటున్న కూల్ డ్రింక్ కంటే మనం తినే అన్నమే మస్త్ డేంజర్ అని చెబుతున్నారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్వీసన్.

ప్రపంచంలో సుమారు 200 కోట్ల మందికి ప్రధాన ఆహారం అన్నమే. అంతేకాదు సుమారు 100 కోట్ల మందికి జీవనాధారం కూడా. అన్నం తినకపోతే వీరిలో సగానికి పైగా జనాలు బతకలేని పరిస్థితి ఉంటది. భారత్, చైనా లాంటి దేశాల్లో ప్రజలకు అన్నం అమృతం లాంటిదే. కానీ ఆకలి తీర్చే ఆ అమృతమే విషం కాబోతున్నదా? అంటే ప్రొఫెసర్ క్వీసన్ అధ్యయనాలు అవుననే అంటున్నాయి.

కూల్ డ్రింక్స్ కంటే కూడా అన్నమే ప్రమాదకరం అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బియ్యం తెల్లగా జిగేల్ మని మెరవడానికి మిల్లులో పాలిష్ చేస్తుంటారు. ఆ చర్య కారణంగా అందులోని పోషకాలున్నీ తౌడు రూపంలో బయటకు వెళ్లిపోతున్నాయని చెబుతున్నారు. అలా పాలిష్ చేసిన బియ్యాన్ని మనం అన్నం గా వండుకుని తినడం వల్ల సరైన పోషకాలు శరీరానికి అందడంలేదని అంటున్నారు.

పాలిష్ చేసిన బియ్యం లోంచి కేవలం గ్లూకోజ్ రూపంలో చక్కెర మాత్రమే శరీరానికి చేరుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చక్కెర మోతాదు బాడీలో పెరిగిపోవడంతో మధుమేహం వ్యాధి రావడానికి దారి తీస్తోందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ఈ పరిశోదకులు చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలోని 3.5 లక్షల మందిని 20 ఏళ్లపాటు పరీక్షించగా రోజు ఒక కప్పు అన్నం తిన్న వారిలో వ్యాధి వచ్చే రేటు 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 

బ్రౌన్ రైస్ బెటర్

బ్రౌన్ రైస్ తినడం వల్ల ఈ రకమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న వాదన కూడా ఉంది. సన్నబియ్యం కంటే తౌడు తీయని దొడ్డు బియ్యమే ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

అయితే ఈ శాస్త్రవేత్తల అధ్యయనాలపై విమర్శలు కూడా వినబడుతున్నాయి. చిన్న కూల్ డ్రింక్ లోనైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని, కానీ అన్నాన్ని కూల్ డ్రింక్ కంటే ప్రమాదకరం అని చెప్పడాన్ని ఖండించేవారు కూడా ఉన్నారు.

ఒక కప్పు అన్నంలో ఉండే పోషకాల లెక్కలివే

53.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు

242 కేలరీలు

4.4 గ్రాముల ప్రొటీన్లు

0.6 గ్రాముల ఫైబర్

0.4 గ్రామలు కొవ్వు పదార్థాలు ఉంటాయి.