గర్భంలో శిశువు మృతికి ఈ బ్లడ్ గ్రూప్ కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే?

మనల్ని ఎవరైనా రక్త గ్రూపులు ఎన్ని అనే ప్రశ్న అడిగితే టక్కున నాలుగు అని చెప్పేస్తాం. మనం చిన్నప్పటి నుంచి అలాగే చదువుకున్నాం.సాధారణంగా మనిషి రక్తం A, B, AB, O గ్రూపులుగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా రక్త గ్రూపులను నిర్ణయిస్తారు. తాజాగా శాస్త్రవేత్తలు మరో అరుదైన కొత్త రక్త గ్రూపును కనుగొన్నారు. వివరాల్లోకెళ్తే యూకే లోని ప్రసిద్ధ బ్రిస్టల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఎన్నో ఏళ్ల పరిశోధనల ఫలితంగా కొత్త రక్త గ్రూపును కనుగొన్నారు. దానికి ఈ ఆర్( ER)గా నామకరణం చేయడం జరిగింది.

కొత్త రక్త గ్రూపు E R ఆవిష్కరణ గర్భంలోని శిశువు మృతి చెందే ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గర్భంలోని శిశువు
మరణాలకు సంబంధించి రెండు కేసులు శాస్త్రవేత్తల వద్దకు వచ్చాయి. రక్తంలో సమస్య వల్ల ఇద్దరు మహిళల్లో గర్భంలో శిశువులు మృతిచెందారు. దీనిపై లోతుగా అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు వారి బ్లడ్‌గ్రూప్‌ E R తేల్చారు.

తల్లి బ్లడ్‌ గ్రూప్‌ E R అయితే ఆమె రోగనిరోధక వ్యవస్థ శిశువు రక్తానికి వ్యతిరేకంగా యాంటిబాడీలను తయారుచేస్తుంది ఈ యాంటిబాడీలు మావి ద్వారా శిశువుకు చేరుకుంటాయి. వారిలో హిమోలిటిక్‌ వ్యాధిని కలుగజేస్తాయి. తద్వారా శిశువు గుండె వైఫల్యంతో తల్లి గర్భంలోనే మరణిస్తాడని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

తల్లి E R రక్త గ్రూప్ అయ్యి శిశువు రక్త గ్రూపు వేరుగా ఉన్నప్పుడు తల్లి రోగనిరోధకశక్తి తీవ్రమైన అనేక ఇన్ఫెక్షన్లకు కారణమై అలాంటప్పుడు శిశు మరణం సంభవిస్తుందని శాస్త్రవేత్త కనుగొన్నారు. ఇలాంటి శిశు మరణాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఈ పరిశోధన సహకరిస్తుందని అలాగే ఈ కొత్త E R బ్లడ్ గ్రూపును సాధ్యమైనంత త్వరగా గుర్తించే సులభమైన పద్ధతిని కనుగొనడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.