శీతాకాలంలో చర్మం పొడిబారడం,పగలడం సర్వసాధారణ దీనికి కారణం మన చర్మం సహజ తేమను కోల్పోవడమే. దీనికి తోడు అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ఉధృతి కూడా ఎక్కువగా ఉండడమే. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలామంది ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా వాడి చర్మ మృదుత్వాన్ని పోగొడుతుంటారు. ఇది చలికాలంలో చాలామంది చేసే పొరపాటే. అలా కాకుండా చర్మ సహజ తేమను రక్షిస్తూనే చర్మ అలర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడడానికి కొన్ని సహజ పద్ధతులను పాటిస్తే సరిపోతుందనీ నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో చర్మం సహజ తేమను కోల్పోతుంది దానికి తోడు సబ్బుతో పదేపదే చర్మాన్ని కడగడం వల్ల చర్మం మరింత పొడి మారుతుంది. అలాగే శీతాకాలంలో ఎక్కువమంది చేసే పొరపాటు వేడి నీటితో స్నానం చేయడం. చర్మంపై సహజ తేమను రక్షించే నూనె లాంటి పొర ఉంటుంది అధిక వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి మారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. స్నానానికి ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్లను మాత్రమే వాడడం మంచిది. విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్న బాగా పండిన బొప్పాయి గుజ్జులో బాగా పండిన అరటిపండు గుజ్జును కలిపి ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రాసుకుంటే మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మం పొడిబారడాన్ని తగ్గించుకోవడానికి సహజ ఆక్సిడెంట్, విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న బాదం చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్ ని తీసుకుని అందులో తగినన్ని పచ్చి పాలు కలిపి చర్మంపై ఫేస్ ప్యాక్ వేసుకొని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సహజ కాంతివంతమైన, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. అలాగే పెరుగు మజ్జిగను సమానంగా తీసుకొని చర్మంపై మృదువుగా అప్లై చేసుకుంటే పెరుగులోని సహజ ఆక్సిడెంట్, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు పొడిబారిన చర్మానికి సహజ తేమను అందించి చర్మం పొడి వారడాన్ని అరికడుతుంది.