భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉండటం చాలా ప్రధానమైనది. మీ రిలేషన్ లో మీ పార్టనర్ పై నమ్మకం లేకపోతే మీకు అభద్రత భావం కలిగి ఎక్కువ రోజులు కలిసి ఉండడానికి ఇష్టపడరు. సంసార జీవితంలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కలిసి కూర్చొని చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు అలా కాకుండా ఎవరికి తోచిన నిర్ణయాలు వారు తీసుకుంటే సంసార జీవితం గతి తప్పుతుంది.
సంసార జీవితంలో దాపరికాలు ఉండకూడదని మన పెద్దవారు చెప్తుంటారు. అయితే ఈ సూత్రం అన్ని సందర్భాల్లోనూ కాదు కొన్ని సందర్భాల్లో మనసులోని మాటను మీ భాగస్వామికి చెబితే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.మీ భాగస్వామితో చెప్పకూడని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ భాగస్వామి కుటుంబంతో ఏవైనా విభేదాలు ,చిన్న సమస్యలు తలెత్తినప్పుడు వారి పట్ల మీకు ద్వేషం కలగవచ్చు. అలాగని మీ భాగస్వామి ముందు పదేపదే వారి కుటుంబం గురించి చర్చించడం, తిట్టడం లాంటి చర్యలు చేయవద్దన్నారు నిపుణులు. దీనివల్ల మీ భాగస్వామి బాధపడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మీపై ద్వేషం,కోపం కూడా పెంచుకోవచ్చు.
మీ జీవిత భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కాలేజీ రోజుల్లో మీరు చేసిన అల్లరి , మీ స్నేహితులతో ఉన్న రిలేషన్, మీరు తిరిగిన తిరుగుళ్ళు గురించి పదేపదే చర్చించవద్దు. మిమ్మల్ని ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే ఆ విషయం మీ భార్యకో, భర్తకో తెలిస్తే వారిలో అభద్రతాభావం కలిగే అవకాశం ఉంటుంది. అది ఇతర పరిణామాలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. ఇది బంధంలో ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన అంశాల గురించి పడక గదిలో అసలు చర్చించవద్దు. ఈ విషయాలకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోండి. మీ భాగస్వామి ముందు ఎవరిని పొగడడం గాని తిట్టడం గాని అసలు చేయవద్దు. ఇలాంటి విషయాలు వేరే అర్థాలకు దారి తీయవచ్చు అందుకే ఇలాంటి తప్పులు పదే పదే చేయకండి.