సహజంగా బొద్దింకల వల్ల ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ ప్రాణాంతక వ్యాధికారక సూక్ష్మజీవుల వాహకంగా పనిచేసి మన ఆహారాన్ని ,నీటిని కలుషితం చేస్తాయి. ఆ విషయం తెలియక ఆహార పదార్థాలను తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దింకలను నివారించడానికి ప్రమాదకర క్రిమిసంహారక స్ప్రేలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు
ఇది అంత మంచి పద్ధతి కాదు. క్రిమిసంహారక మందుల అవశేషాలు మన ఆరోగ్యం పై ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
బొద్దింకలను సహజ పద్ధతిలో ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. బొద్దింకలు తడి ప్రదేశాల్లో మరియు అపరిశుభ్ర ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తాయి. బొద్దింకలను తరిమికొట్టడానికి సులభమైన పద్ధతి వేప పొడిని లేదా వేప నూనెను అధిక తడి ఉన్న వండగదిలోను డస్ట్ బిన్ దగ్గర తరచూ స్ప్రే చేస్తుంటే బొద్దింకలు తొలగిపోవడంతో పాటు అనేక ప్రాణాంతక సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి. బిర్యానీ ఆకులతో బొద్దింకలను తరిమికొట్టవచ్చు. బిర్యానీ ఆకుల వాసన ఘాటుగా ఉండటంవల్ల బొద్దింకలు తిరిగే చోట వీటిని ఉంచితే ఘాటైన వాసనకు బొద్దింకలు దూరంగా పారిపోతాయి.
బొద్దింకల సమస్యను నివారించడంలో బోరిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తుంది. బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో బోరిక్ యాసిడ్ చల్లుకుంటే బొద్దింకలు ఇంటి ఛాయాల్లో కూడా రావు. తరచూ అమ్మోనియా ఉపయోగించి ఇల్లు శుభ్రం చేసుకోవడం వల్ల బొద్దింకల సమస్యతో పాటు అనేక వ్యాధికారక సూక్ష్మజీవులునశించిపోతాయి. మన వంటింట్లో ఎల్లప్పుడూ లభించే ఉల్లి వెల్లుల్లి మిరియాలను మిశ్రమంగా చేసుకుని బొద్దింకలు ఉండే ప్రాంతాల్లో చల్లుకుంటే బొద్దింకల సమస్య తొలగిపోతుంది. అలాగే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు అనేక ప్రాణాంతక ఫంగల్ బ్యాక్టీరియా వైరస్లను నశింప చేయడంలో కూడా సహాయపడతాయి.