సామాన్యులకు భారీ షాక్…మరోసారి భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు.. ?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి గ్యాస్ నిత్యవసరంగా మారిపోయింది.గతంలో ప్రజలు వంట చేయటానికి కట్టెలు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం పట్టణాలతో పాటు గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు కూడా గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకి పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఇక తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు మరొకసారి పెరిగి సామాన్య ప్రజల గుండెల్లో గుబులు పెంచాయి. మార్చినెల ఆరంభంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి.

దీంతో అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల తో పాటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా దాదాపు 8 నెలల తరువాత డొమెస్టిక్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రేటు రూ. 1155కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఈ రేటు రూ. 1161 కి చేరుకుంది. ఇక గతంలో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1053 ఉండగా మార్చి1 నుంచి 1103 రూయాయలకు చేరింది.

ఇక కమర్షియల్‌ సిలిండర్‌ ధర నిన్న 1769రూపాయలు ఉండగా..ఇవాళ 2119 రూపాయలకు చేరింది. అంటే ఏకంగా రూ. 350 పెరిగింది. అలాగే కోల్‌కతాలో రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ఇక ముంబైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721గా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ. 2071కు చేరింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268కు పెరిగింది. ఇలా దేశ వ్యాప్తంగా మార్చి నెల ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగి సామాన్యులకు భారంగా మారింది. ఇదిలా ఉండగా గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. దీంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. కానీ ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేయడంతో సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనుంది.