సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో రజనీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ లో 168 సినిమాలు చేసానని.. పదిహేనేళ్లుగా మురుగదాస్ తో పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ – “ఇన్నేళ్లుగా నేను హీరోగా నటిస్తున్నాన్నంటే కారణం ప్రేక్షకుల ప్రేమాభిమానాల ప్రోత్సాహమే కారణం. ఇంత వయసులోనూ ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కొంత మంది అడుగుతుంటారు. తక్కువగా ఆశపడండి. తక్కవగా బాధపడండి.. తక్కువగా భోజనం చేయండి.. తక్కువగా నిద్ర పోండి.. తక్కువగా ఎక్సర్ సైజ్ చేయండి. తక్కువగా మాట్లాడండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం. 1976 తెలుగులో అంతులేని కథ విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎలా ప్రేమిస్తారో అదే ప్రేమను తెలుగు ప్రేక్షకులు ఇవ్వడం నా భాగ్యంగా, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. తెలుగు ప్రేక్షకులు సినీ ప్రేమికులు. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారు. నేను చేసిన భాషా, ముత్తు, పెదరాయుడు, నరసింహ, చంద్రముఖి, రోబో కేవలం నాకోసమే ఆడలేదు. మంచి సినిమాలు. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. అందరూ సినిమా బాగా హిట్ కావాలనే చేస్తారు. అయితే సినిమా చేసే సమయంలో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ మన చేతుల్లో ఉండదు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జరిగింది. మురుగదాస్‌గారితో పనిచేయాలని 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది.
సుభాస్కరన్‌గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాలంటే ప్యాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశాను. ఈ కథను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగదాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది. కెమెరామెన్ సంతోశ్ శివన్, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాకు వెయిట్ పెంచారు. రామ్ లక్ష్మణ్ అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. తిరుపతి ప్రసాద్‌గారు తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. దర్బార్ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. 168 సినిమాలు చేశాను. దర్బార్ అందరికీ నచ్చుతుంది“ అన్నారు.