Director Ugandhar Muni: వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. ప్రీమియర్లతో మొదలైన పాజిటివ్ టాక్‌తో డే వన్ అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోండటంతో దర్శకుడు యుగంధర్ ముని శుక్రవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
*‘శంబాల’ ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైంది?*
మూడేళ్ల క్రితం ఈ పాయింట్ అనుకున్నాను. నాకు రాజశేఖర్ గారితో ఐదేళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ పాయింట్‌ను ఆయనకు చెప్పాను. ఆ కథ నిర్మాత గారికి చాలా నచ్చింది. ఆ తరువాత మహిధర్ గారు వచ్చారు. అలా మా ఈ జర్నీ మొదలైంది.
*‘శంబాల’ కథను రాయడంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?*
దర్శకుడిగా ఈ కథను ఎంతో బాధ్యతతో రాసుకున్నాను. నేను చెప్పే కథను చాలా మంది చూస్తారు. ఎంతో నేర్చుకుంటారు. ఏ ఒక్కరినీ బాధపెట్టకూడదు. సైన్స్, శాస్త్రానికి మధ్య బాలెన్స్ చేయాలని, ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీయకూడదని ముందే అనుకున్నాను.

*‘శంబాల’కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు?*
‘శంబాల’ రెస్పాన్స్ చూసి నాకెంతో ఆనందంగా ఉంది. హౌస్ ఫుల్ బోర్డులు పడినా కూడా గేట్లు తన్నుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ నేను చిన్నప్పుడు చిరంజీవి సినిమాలకు చూశాను. ఇప్పుడు ఇలా నా మూవీకి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. తమిళనాడు, కర్ణాటకలోనూ మా సినిమాకు మంచి స్పందన వస్తోంది.
*‘శంబాల’ విజయం సాధించడంపై ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేశారా?*
ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. హీరోలు, దర్శక, నిర్మాతలందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఆది గారు ఈ మూవీ విజయం పట్ల ఆనందంగా ఉన్నారు. ఆయన ఇలాంటి ఓ సక్సెస్ కోసం చాలా కష్టపడుతూనే వచ్చారు. సెట్‌లో ఎన్ని గాయాలైనా కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా వర్క్ చేశారు.
*‘శంబాల’ మూవీకి టెక్నికల్ టీం చేసిన సపోర్ట్ గురించి చెప్పండి?*
ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాలకి నా స్క్రిప్ట్ గురించి ముందే వివరించాను. నాకు ఎలా కనిపించాలి? నా విజన్ ఏంటి? అని ఇలా అన్నీ ముందుగానే క్లియర్‌గా చెప్పాను.
*ఆది గారు ‘శంబాల’ కథలో ఇచ్చిన ఇన్ పుట్స్ గురించి చెప్పండి?*
ఆది గారు స్క్రిప్ట్‌లో ఎక్కువగా ఇన్ పుట్స్ ఇవ్వలేదు. కథా చర్చల టైంలో ఆది గారు సలహాలు ఇచ్చారు. కానీ ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయిన తరువాత ఆయన మళ్లీ ఛేంజెస్ చెప్పలేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా నటించుకుంటూ వెళ్లారు.
*‘శంబాల’ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?*
ఉల్క పడిన ప్రాంతం ఎలా ఉంటుంది? అనే విషయంలో చాలా రీసెర్చ్ చేశాను. ఉల్క పడితే ఏం జరుగుతుంది? దాని చుట్టూ ప్రాంతం ఎలా ఉంటుంది? అని బ్రెజిల్‌లో జరిగిన ఘటనల మీద పరిశోధన చేశాం.

*సైన్స్, శాస్త్రం అని బ్యాలెన్స్ చేయడం కోసం ఎలాంటి పాయింట్స్ తీసుకున్నారు?*
ప్రాణవాయువు అని మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఆక్సిజన్ అని కొన్నేళ్ల క్రితం కనిపెట్టాం. రావి చెట్టు, తులసి చెట్టు, వేప చెట్టు నుంచి ప్రాణ వాయువు వస్తుందని మన పురాణాలు చెబుతాయి. అందుకే ప్రతీ ఇంట్లో వాటిని పెంచుకునేవారు. ఇప్పుడు సైన్స్ అని చెబుతాం. కానీ మనకు ఇవన్నీ ఎప్పటి నుంచో మన కల్చర్‌లోనే ఉంటాయి.
*‘శంబాల’ ఆర్ఆర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా?*
శ్రీ చరణ్ పాకాల సౌండింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. సిద్దార్థ్ అనే వ్యక్తి సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా చేశారు. విష్ణు గొప్పగా మిక్సింగ్ చేశారు.
*‘శంబాల’లో ఆది, ఇతర ఆర్టిస్టుల గురించి చెప్పండి?*
‘శంబాల’ కథకి కంప్లీట్ యాక్టర్, అన్ని రకాల ఎమోషన్స్ పండించే హీరో కావాలని నేను అనుకున్నాను. రాజశేఖర్ గారు ఆది పేరు చెప్పారు. ఆది గారు ఈ పాత్రకు న్యాయం చేశారు. ఈ చిత్రంలో ఆర్టిస్టులంతా కూడా చాలా సపోర్ట్ చేశారు. వారి సహకారంతోనే ఇంత గొప్పగా సినిమాని తీయగలిగాను.
*‘శంబాల’కి బడ్జెట్ పెరిగింది కదా?*
‘శంబాల’ కథ అనుకున్నప్పుడు ఓ బడ్జెట్ అనుకున్నాం. ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి చూస్తే అక్కడే ఓ ముప్పై శాతం బడ్జెట్ పెరుగుతుందని అర్థమైంది. ఆ తరువాత చివరకు ఓ పది శాతం బడ్జెట్ పెరిగి ఉంటుంది. అయినా సరే నిర్మాతలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు నాకు అండగా నిలబడ్డారు. వారి సహకారం ఎప్పుడూ మర్చిపోలేను.
*మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?*
నాకు సూపర్ నేచురల్, థ్రిల్లర్ జానర్‌లంటేనే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం నేను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌లోనే సినిమా చేయబోతోన్నాను. ఇంకా కథ గానీ, ఆర్టిస్టులు గానీ ఫైనల్ కాలేదు.

