ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాకి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నటుడు సూర్య వశిష్ఠ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ కుటుంబ నేపథ్యమేంటి? బుట్టబొమ్మ అవకాశం ఎలా వచ్చింది?
మా నాన్నగారు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఆయనను అందరూ సత్యం గారు అని పిలుస్తారు. రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారి దగ్గర కోడైరెక్టర్ గా పనిచేశారు. నన్ను నటుడిగా చూడాలనేది ఆయన కోరిక. నాక్కూడా సినిమాలంటే చాలా ఇష్టం. అమెరికాలో చదువు పూర్తి చేసి, కొంతకాలం ఉద్యోగం చేశాక.. ఇక్కడికి వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒకసారి నాన్నగారు కప్పేల సినిమాని చూపించి ఇందులోని ఆటో డ్రైవర్ పాత్ర నీకు సరిగ్గా సరిపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ మూవీ రీమేక్ రైట్స్ సితార సంస్థ తీసుకోవడంతో, మా వాళ్లే తీసుకున్నారు అంటూ ఎంతో సంతోషించారు. కానీ నాన్నగారు కోవిడ్ తో మరణించడంతో ఒక ఏడాది పాటు అసలు బయటకు రాలేదు. ఆ తర్వాత ఒకసారి త్రివిక్రమ్ గారిని కలిస్తే ఆయన సూచన మేరకు సితారలో ఆడిషన్ ఇచ్చాను. అలా బుట్టబొమ్మ చిత్రానికి ఎంపిక అయ్యాను. మా నాన్నగారి చివరి కోరిక నెరవేరేలా చేసిన త్రివిక్రమ్ గారికి, సితార సంస్థకి జీవితాంతం రుణపడి ఉంటాను.
సినిమాల్లోకి ఆలస్యంగా రావడానికి కారణమేంటి?
మా నాన్నగారికి మొదటి నుంచి నన్ను సినిమాల్లోకి తీసుకురావాలని కోరిక ఉంది. అయితే ముందుగా ప్రపంచాన్ని, మనుషులను అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో నన్ను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు. అక్కడ ఐదేళ్లు ఉన్న తర్వాత ఇక ఇక్కడికి వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టమన్నారు.
సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది?
అది నాన్న గారి నుంచే వచ్చింది. ఆయన పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. నన్ను ఒక మంచి నటుడిగా చూడాలి అనుకున్నారు. నాకు కూడా చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. నటన నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం మా నాన్నగారి కలను నిజం చేస్తుండటం సంతోషంగా ఉంది.
బుట్టబొమ్మ లో భాగం కావడానికి ప్రధాన కారణం?
మలయాళ వెర్షన్ చూసినప్పుడు ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో ఇంత అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడూ ఇలాంటి కొత్తదనం ఉన్న పాత్రలు పోషించాలని ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది.
అనిఖా, అర్జున్ దాస్ తో కలిసి పని చేయడం ఎలా ఉంది?
వారితో కలిసి పని చేయడం సెట్స్ లో ఎంతో సరదాగా ఉండేది. అనిఖా మంచి మనసున్న అమ్మాయి. తనకు తెలుగు రాకపోవడంతో.. కొన్ని కొన్ని సంభాషణల్లో సాయం చేసేవాడిని. అర్జున్ దాస్ అప్పటికే స్టార్. ఆయన తన గొంతుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆయన నాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు.
షూటింగ్ సమయంలో ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నారు?
దర్శకుడు రమేష్ గారు ప్రతి సన్నివేశం, ప్రతి షాట్ మీద చాలా వర్క్ చేస్తారు. మంచి ఔట్ పుట్ కోసం ఆయన ఎన్ని టేక్ లు అయినా తీసుకుంటారు. దాంతో ముఖంలో ఆ అలసట కనిపించకుండా నటించాల్సి వచ్చేది. అలాగే క్లైమాక్స్ షూటింగ్ సమయంలో గాయాలపాలై ఆస్పత్రిలో చేరాను.
ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రశంసలు దక్కాయి?
సినిమా మొదలు కావడానికి ముందు.. ఇది నీ మొదటి సినిమా అని ప్రేక్షకులకు అనిపించకుండా ఉండేలా నటించాలని దర్శకుడు రమేష్ గారు అన్నారు. ఆయన మాటలను దృష్టిలో పెట్టుకొని ఎంతో కష్టపడ్డాను. ఇటీవల మా దర్శక నిర్మాతలు సినిమా చూసి నా నటనను మెచ్చుకోవడంతో చాలా ఆనందం కలిగింది.
తదుపరి సినిమాలు?
నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు అంటే ఇష్టం. అలాంటి సినిమాల్లోనే ఎక్కువగా నటించాలి అనుకుంటున్నాను. బుట్టబొమ్మ టీజర్ విడుదలయ్యాక పలువురు నూతన దర్శకులు నన్ను సంప్రదించారు. మరికొన్ని కథలు విని, బుట్టబొమ్మ విడుదల తర్వాత నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను.
మీ అభిమాన దర్శకులు?
రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు. వారిని చాలా దగ్గర నుండి గమనించాను. వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే అసలు వదులుకోను.
మీ ఏ జోనర్ సినిమాలు ఇష్టం?
బుట్టబొమ్మ అనుభవంతో నేను థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలకు సరిపోతాను అనిపిస్తుంది. కేవలం హీరోగానే చేయాలి అనుకోవడం లేదు. ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.