రవితేజ గారి కెరీర్ లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒక మైలు రాయిగా నిలుస్తుంది: రామ్ లక్ష్మణ్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’ లో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా.. వీటి ప్రత్యేతక ఏమిటి ?
మేము కూడా స్టువర్ట్ పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చిన్నప్పుడు వూర్లో కథలు కథలుగా విన్నాం. ఆ రకంగా ఈ కథ మాకు కొంచెం దగ్గరగా కనెక్ట్ అయింది. రవితేజ గారు కూడా ఈ క్యారెక్టర్ చాలా బాగా యాప్ట్ అయ్యారు. అన్నీ కథకు బాగా కుదిరాయి. టైగర్ నాగేశ్వరరావు యాక్షన్ ని రియలిస్టిక్ గా కంపోజ్ చేశాం.

‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చిన్నప్పుడు ఎలాంటి కథలు వినేవారు ?
‘టైగర్ నాగేశ్వరరావు’ గారి గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తెవారని.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వినేవాళ్ళం. సవాల్ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు. అందరికీ చెప్పి దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఒక పాత్రని చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. ఆయన చెన్నై జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయనకి టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారు. ఒక దొంగకి పోలీసులు బిరుదు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. మేము ఒక ఫైట్ తీసినప్పుడు రోఫ్ కడతాం, బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చి వుంటుందనేది నిజంగా ఆశ్చర్యకరం. ఒక దొంగ ఇంత పాపులర్ అయ్యారంటే దాని వెనుక నేచర్ సపోర్ట్, ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు ? అని ఒక ప్రధాన మంత్రి దగ్గర కూడా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు.

ఇందులో యాక్షన్ ని చాలా రియలిస్టిక్ గా కంపోజ్ చేశాం. ఆయన నివసించిన చీరాల ప్రాంతంలో జీడి తోటల్లో నే కొన్ని యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశాం. రవితేజ గారితో ఎన్నో చిత్రాలు పని చేశాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇందులో ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ని ప్రేక్షకులు రియల్ గా ఫీలౌతారు. రవితేజ గారు చాలా కష్టపడ్డారు.

టీజర్ లో రైలు యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా వుంది.. దాని గురించి చెప్పండి ?
‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితంలో ఊహకు అందని కొన్ని విషయాలు వున్నాయి. అప్పట్లో ట్రైన్ , బస్సు .. స్టువర్ట్ పురం దాటే వరకూ ఒక భయం వుండేది. ఆయన రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారు. ఇందులో యాక్షన్ ని డిజైన్ చేయడంలో రవితేజ గారు ఎంతో సహకరించారు. రవితేజ గారు యాక్షన్ లో ఎక్కడా రాజీపడలేదు. రియలిస్టిక్ గా యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. యాక్షన్ కోసం చాలా కష్టపడ్డాం. ఇంత పవర్ ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి థాంక్స్ చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ గారి సినిమా వెళ్ళబోతుంది. తప్పకుండా ‘టైగర్ నాగేశ్వరరావు’ అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.

‘టైగర్ నాగేశ్వరరావు’ గా రవితేజ గారు ఎలాంటి కసరత్తు చేశారు ?
రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ పాత్రకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. రవితేజ గారి ఫిట్నెస్ అద్భుతంగా వుంటుంది. ఇందులో మరింత ఎనర్జిటిక్ అండ్ యంగ్ గా కనిపిస్తారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. రవితేజ గారికి ఈ సినిమా ఒక మైలు రాయి అవుతుందనే నమ్మకం వుంది.

దర్శకుడు వంశీ గురించి ?
వంశీ మాకు చిన్నప్పటినుంచి తెలుసు. చెన్నైలో చదువుకున్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్ళ పాటు లోతుగా పరిశోధన చేశాడు. స్థానిక ప్రాంతాల్లో తిరిగి ఎన్నో ఆయన గురించి ఎన్నో విషయాలు సంగ్రహించాడు. అద్భుతమైన కథని తయారు చేసి చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాతో వంశీకి చాలా మంచి పేరువస్తుంది.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ గురించి ?
అభిషేక్ అగర్వాల్ గారు ఇందులో ఫైట్స్ చూసి చాలా ఆనందపడ్డారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అప్పటి పరిస్థితులకు తగట్టు చాలా అద్భుతమైన నేటివిటీని ఇందులో చూపించడం జరిగింది. లోకేషన్స్ అన్నీ చాలా బావుంటాయి. ఇందులో అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి.

కెమరామెన్ మధిగారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. డైరెక్టర్, కెమరామెన్ చాలా మంచి సమన్వయంతో పని చేశారు. అలాగే మా ఫైటర్స్ కి కూడా ఇది ఒక సవాల్ తో కూడుకున్న కంపోజిషన్.

ఆల్ ది బెస్ట్
థాంక్స్