#కృష్ణారామా అన్ని జనరేషన్స్ ని అలరించే చాలా మంచి ఎంటర్‌టైనర్‌: రాజ్‌ మదిరాజు

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న నేపధ్యంలో దర్శకుడు రాజ్‌ మదిరాజు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి గారిని ప్రధాన పాత్రల్లో తీసుకోవడాని కారణం ?
‘బామ్మమాట బంగారుబాట’ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి గారు మళ్ళీ జోడిగా ఈ చిత్రంలో నటించారు. నందిని రెడ్డి గారి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే సినిమాలో రాజేంద్రప్రసాద్ గారికి బావమరిది పాత్రలలో నటించాను. ఆ సమయంలో ఈ కథని రాజేంద్ర ప్రసాద్‌ గారికి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. గౌతమి గారికి కథ చెప్పమని ఆయన సూచించారు. అయితే గౌతమి గారు బామ్మలా కనిపించరు. కాస్త భయం భయంగానే కథ చెప్పాను. గౌతమి గారికి కూడా చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. గౌతమి గారి స్టయిలిస్టు తో కూడా అప్పుడే మాట్లాడారు. ఇందులో ఆసక్తికరమైన పాత్ర అనన్య శర్మ. 30 Weds 21తో ఆమెకంటూ ఒక గుర్తింపు ఏర్పడింది. నా పాత్ర కూడా అలాంటి ఒక క్యూట్ అమ్మాయి కావాలని పేస్ బుక్ లో పోస్ట్ పెట్టాను. అనన్య శర్మ మేనేజర్ సంప్రదించారు. అనన్యకి కూడా ఆ పాత్ర చాలా నచ్చింది. తన పాత్ర చాల క్రిస్ప్ గా వుంటుంది. ఆ పాత్ర ఈ సినిమాకి మంచి వాల్యు యాడ్ లా వుంటుంది. అలాగే శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌ ఇలా పాత్రలన్నీ చాలా చక్కగా కుదిరాయి.

‘#కృష్ణారామా కథలో ఫేస్ బుక్ నేపధ్యం కనిపిస్తుంది.. ఈ కథకి స్ఫూర్తి ?
ఈ కథ మొదలైయింది మా అమ్మానాన్నల దగ్గర. ఐదేళ్ళ క్రితం మా అమ్మ ఫేస్ బుక్ లోకి వచ్చారు. దీనికి కారణం ఒంటరిగా ఫీలవ్వడం. అమ్మానాన్న నాగోల్ లో వుంటారు. మేమంతా ఏ వీకెండ్ కో ఎదో వీలు కుదిరినప్పుడు వెళ్లి వస్తుంటాం. తర్వాత మా పనుల్లో పడిపోతాం. అయితే ప్రతిసారి మేము ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత ఒంటరిగా ఫీలౌతున్నారో అర్ధమౌతుంది. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఫేస్ బుక్ లోకి వచ్చారు. నాన్న ఆలోచనలని అమ్మ టైప్ చేసి పెడుతుంది. ఒక విధంగా ఇది మా ఇంట్లో పుట్టిన కథే. కృష్ణారామా అనుకునే వయసులో వాళ్ళ నేపధ్యం జరిగే కథకు తగిన టైటిల్ గా ‘#కృష్ణారామా అని పెట్టాం. టైటిల్ వచ్చిన తర్వాత కృష్ణావేణి, రామతీర్ధ అనే పాత్రల పేర్లు కుదిరాయి.

#కృష్ణారామా మొదట వెబ్ సిరిస్ గా అనుకున్నారా ?
నిజానికి సినిమా, వెబ్ సిరిస్ రెండు రకాలుగా అనుకున్నాం. ఎందుకంటే ఇందులో చెప్పడానికి చాలా విషయం వుంది. 65 ఏళ్ళు తర్వాత ఐసోలేషన్ జనరేషన్ గా చూస్తున్న పరిస్థితి. రిటైర్ అయిపోతే వాళ్ళ జీవితమే అయిపోయిందనే భావనలోకి వెళ్ళిపోతాం. నిజానికి పెద్ద కార్పోరేట్ వ్యవస్థల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటారు. వాళ్ళ అనుభవాన్ని వాడుకోవాలనేది దిని ఉద్దేశం. అయితే ఇంత అనుభవాన్ని ఒక్క రోజుతో ఈ సొసైటీకి పనికి రాదని తెల్చేస్తున్నాం. అలా కాదు.. ఆ అనుభవం సమాజానికి అవసరం అని చెప్పడం ఇందులో ముఖ్య ఉద్దేశం.

నటుడిగా చేశారు.. దర్శకుడిగా చేశారు.. ఇందులో ఏది కష్టం అనిపించింది ?
నేను చెప్పులు మార్చేస్తాను( నవ్వుతూ) దర్శకత్వంలో అన్నీ మన కంట్రోల్ లో వుంటాయి. నేను రాసింది, ఫీలైయింది, నటులకి చెప్పి, వాళ్ళ నుంచి కావాల్సింది రాబట్టుకోవడం.. ఇవన్నీ దర్శకత్వంలో వుంటాయి. వాటిని ఇష్టపడతాను. నటుడిగా నా పరిధులు నాకు తెలుసు. ఆ పరిధిలోనే వుంటాను. ఇది దర్శకుడిగా ఆరో సినిమా.

నటుడిగా దర్శకుడిగా ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు ?
దర్శకుడిగా చేసేటప్పుడు నటన జోలికి వెళ్ళను. మీరు గమమనిస్తే నటుడిగా చాలా గ్యాప్స్ వుంటాయి. నా కథని నేనే రాసుకుంటాను. దాని కోసం చాలా కసరత్తు, రీసెర్చ్ వుంటుంది. దాని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను, అందుకే నటుడిగా చాలా అవకాశాలు వొదులుకోవాల్సి వస్తుంది. నటుడిగా భిన్నమైన పాత్రలు చేయాలని వుంది.

‘ఈటీవీ విన్‌’లో విడుదల చేయడానికి కారణం ?
ఈటీవీ చాలా గొప్ప సంస్థ. మంచి అభిరుచి గల చిత్రాలని రూపొందిస్తారని అందరికీ తెలుసు. మేము చెప్పిన వెంటనే అంగీకరించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్‌ గారికి కూడా వారితో మంచి అనుబంధం వుంది. సినిమా చాలా అద్భుతమైన స్పందనతో స్ట్రీమ్ అవుతోంది. #కృష్ణారామా అన్ని జనరేషన్స్ ని అలరిస్తుంది.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
రెండు మూడు కథలు వున్నాయి. ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ వుంది. త్వరలోనే వివరాలు చెప్తాను. నటుడిగా గౌతమ్ తిన్ననూరు సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను.

ఆల్ ది బెస్ట్
థాంక్స్