ఆస్కార్.. ప్రతీ నటుడి కల. ప్రపంచ వ్యాప్తంగా వున్న నటులు చాలా మంది ఒక్క ఆస్కార్‌ని చేతిలో పట్టుకుని ఠీవీగా ఫొటోలకి పోజులివ్వాలని కలలు కంటుంటారు. అందుకే ఆస్కార్ పురస్కారాల వేడుక అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎవరెవరు అవార్డుల్ని దక్కించుకున్నారా? దక్కించుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వేడుక సాక్షిగా తమ తళుకు బెళుకులని రెడ్ కార్పెట్‌పై నడుస్తూ యావత్ ప్రపంచానికి చూపించాలని, ఫ్యాషన్ షో చేస్తుంటారు హాలీవుడ్ భామలు. అందులో మన బాలీవుడ్ భామలు కూడా మెరుస్తుంటారు. అంతా ఎదరుచూసే ఆస్కార్ అవార్డుల పండగ రానే వచ్చేసింది.
లాజ్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ సోమవారం ఉదయం అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారధులు హాజరయ్యారు. `జోకర్` చిత్రంలో అత్యద్భుతమైన నటనని ప్రదర్శించిన జాక్వాన్ ఫీనెక్స్ ఉత్తమ నడుడిగా అవార్డుని అందుకున్నారు. `జూడీ` చిత్రానికి గానూ రెనీ జెల్ వెగర్ ఉత్తమనటి అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ చిత్రంగా `పారాసైట్`, ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్పీట్ పురస్కారాల్ని దక్కించుకున్నారు. `వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్` చిత్రానికి గానూ బ్రాడ్ పీట్ ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఉత్తమ యానిమేటెట్ ఫీచర్ చిత్రంగా `టాయ్‌స్టోరీ-4` అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డుల్లో మొత్తం 9 చిత్రాలు అవార్డుల్ని దక్కించుకున్నాయి.