‘బిగ్‌బాస్‌ 3’లో నిజ జీవిత టాలీవుడ్ జంట?

వివాదం, వినోదం కలగలిస్తే…బిగ్ బాస్. హిందీలోనూ, తమిళంలోనూ బాగా సక్సెస్ అయిన ఈ షో తెలుగులోనూ అదే స్దాయిలో కాకపోయినా బాగానే సక్సెస్ అయ్యింది. ‘బిగ్‌బాస్‌’ మొదటి సీజన్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెండో సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని సందడి చేశారు. మూడో సీజన్‌కు నాగార్జునను ఫైనల్ చేసి ప్రోమో వదిలారు. అయితే ఈ షోలో ఎవరు పాల్గొనబోతున్నారనే విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. దాంతో ఈ సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 3’పై ఇప్పటినుంచే ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

‘బిగ్‌బాస్‌ 3’లో వరుణ్‌ సందేశ్, ఆయన భార్యతో కలిసి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.అదే కనుక నిజమై జరిగితే తొలిసారి ఇలా ఓ కపుల్ ..బిగ్ బాస్ లో పాల్గొనటం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయమై వరుణ్ సందేశ్ తో మాట్లాడారని చెప్పుకుంటున్నారు. ఆయన భార్య సంగతి ఎలా ఉన్నా , తాను పాల్గొంటానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇద్దరి కలిసి పాల్గొంటే బాగుంటుందని ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. వంద రోజుల పాటు ఉండే ఈ షోలో నిజ‌మైన భార్యాభ‌ర్త‌ల‌ను ఉంటే.. వాళ్లు చేసే ప్ర‌తీ ప‌ని ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. దాంతో కెమెరా క‌ళ్ల‌న్నీ వాళ్ల‌పైనే ఉంటాయనేది నిజం.

ఈ షోలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల పాల్గొనబోతున్నారని రూమర్స్ వినిపించాయి. దీనిపై జ్వాల ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన గురించి వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ షోలో పాల్గొనాలని జ్వాలకు అవకాశమిస్తే ఆమె ఎక్కువ పారితోషికం అడిగారని అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదని సమాచారం. అందుకే ఆమె పాల్గొనడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. అలాగే శోభిత ధూళిపాల, యాంకర్ లాస్య వంటి వారు ఇప్పటికే తాము ఈ షోలో పాల్గొనటంలేదని క్లారిటీ ఇచ్చేసారు.