కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కొత్త హీరో పెద్ద హీరో అనే తేడా కూడా చూడడం లేదు. విజయం నల్లేరుపై నడకలా మారింది. కథ, కథనం గ్రిప్పింగ్ గా లేకపోయినా.. బాలేదు అన్న మాట వినిపించినా జనం థియేటర్లకు వెళ్లడం లేదు. ప్రతిదీ విశ్లేషించుకున్నాకే థియేటర్లకు వెళుతున్నారు. లేదంటే అమెజాన్ లో వచ్చే వరకూ ఆగి చూస్తున్నారు.
అయితే త్వరలో రిలీజ్ కి రాబోతున్న రాయలసీమ లవ్ స్టోరీ అందరికీ నచ్చే చిన్న సినిమా అంటూ నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అయితే అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా వివాదం ఎదుర్కోవాల్సి వస్తోంది. సినిమాలో అశ్లీల సన్నివేశాలు, రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా.. ప్రేమను కించ పరిచేలా సినిమా ఉందని రాయలసీమ ప్రత్యేక హక్కుల పోరాట సమితి ఆరోపించింది. వెంటనే సినిమాలో ఇబ్బందికర సన్నివేశాలతో పాటు, టైటిల్ మార్చాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు రామ్ రణధీర్, నిర్మాతలు చిన్నా, నాగరాజ్ లకు వార్నింగ్ అందింది. అయితే తమ సినిమా ద్వారా ఎలాంటి తప్పుడు సందేశం ఇవ్వనప్పుడు ఎందుకు మార్చాలని దర్శకుడు ఖండించారు. తాజాగా రాయలసీమ ప్రత్యేక హక్కుల కమిటీ మరో అడుగు ముందుకేసి ఆ సినిమా పోస్టర్లను తగల బెట్టింది. తక్షణం దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పి, సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేసారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాన్ని రిలీజ్ కానివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ చిత్రంలో వెంకట్, హృశాలి,పావని ప్రధాన పాత్రలు పోషించారు.