చైతు ‘మజిలీ’ కథ ఇదేనా? !

‘నిన్ను కోరి’ వంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత కలసి నటిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసిన చిత్ర టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేఫధ్యంలో చిత్రం కథ ఏమై ఉంటుందా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లవ్ లో ఫెయిల్ అవుతాడు చైతు. అతనో క్రికెటర్. పెద్దవాళ్లు ఒప్పించి పెళ్లి చేస్తారు. కానీ అతను తన పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు. అతని జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి (సమంత) భార్యగా వస్తే.. ఆ తరువాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి…వద్దనుకుని వెళ్లిపోయిన కెరీర్ ని ఎలా నిలబెట్టుకుని.. ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది.

చూస్తూంటే ఓ రకంగా ఇది నిన్ను కోరి కి రివర్స్ పాయింట్ లా అనిపిస్తోకంది. నిన్ను కోరిలో నాని …ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. నాని ఆమెను మర్చిపోలేకపోతాడు. ఇక్కడ ఈ సినిమాలో నాగచైతన్య ప్రేమ విఫలమై పెళ్లి చేసుకుంటాడు. అక్కడ ఆది పినిశెట్టి చేసిన పాత్ర లాంటిది ఇందులో సమంత ది అని ట్రైలర్ చూసినవారికి అర్దమవుతోంది.

ఏ మాయ చేశావే, ఆటో నగర్‌ సూర్య, మనం ఇలా వరస సినిమాల్లో నటించిన నాగ చైతన్య, సమంత.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. వీరి వివాహానంతరం తెరపై మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలి’.

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.