‘మహర్షి’: ఇలా చేస్తే మహేష్ కు కాలదా? జాగ్రత్త!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది చిత్రయూనిట్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 25 రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది.

షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావటానికి మరింత సమయం పడుతుందన్న ఆలోచనతో విడుదల కొద్ది రోజులు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మహర్షి యూనిట్‌. ఏప్రిల్ 25న కాకుండా మే 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే ఈ విషయమై మహేష్ ఎలా స్పందిస్తారనే విషయమై టీమ్ టెన్షన్ లో ఉందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రిలీజ్ డేట్ మారుస్తాను అన్నప్పుడే మహేష్ సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.