పారితోషికం తక్కువైతే నిర్మొహమాటంగా అడుగుతా

ఇస్మార్ట్ శంకర్‌లో ఇద్దరు బ్యూటీలున్నా సక్సెస్‌ను పూర్తిగా క్యాప్చర్ చేసిన ఇస్మార్ట్ మాత్రం  నభానటేష్. ఇస్మార్ట్ రామ్ పక్కన టర్కీ కోడిగా చెలరేగిపోవడంతో -నభాను వెతుక్కుంటూ అవకాశాలు బాగానే వచ్చాయి. అలా ఎంపిక చేసుకున్న వాటిలో ఈమధ్యే వచ్చిన ‘డిస్కోరాజా’ ఫ్లాపైనా ఆ ఇంపాక్ట్ తనపై పడకుండా నభా జాగ్రత్తపడింది.
 
ఇప్పుడు సాయితేజ్‌తో సోలో బతుకే సో బెటర్ చేస్తోన్న నభా  పారితోషికంగా పెంచేసిందన్న కథనాలపై గుర్రుమంటోందట. ‘ఎంతివ్వాలో నిర్మాతలకు తెలుసు. ఎంతిస్తున్నారో తీసుకుంటున్న నాకు తెలుసు. అటూ ఇటూ క్లారిటీ ఉంది కనుక  కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అంటోందట నభా.
 
అయినా ‘ఇంకా ఎదిగే ప్రయత్నాల్లోనే ఉన్నాను తప్ప, డిమాండ్ చేసేంత స్థాయికి ఎదిగిపోలేదు. ఒకరిని ఇబ్బంది పెట్టే టైపు కాదు. ఇచ్చేది తక్కువైతే నిర్మొహమాటంగా అడుగుతా. నచ్చినంత సంతోషంగా ఇస్తే కాదనకుండా సినిమాలు చేస్తా’ అంటూ గడుసుగా. నాలుగు సినిమాలు చేసేసరికే నభా ఆరితేరిపోయిందన్న మాట!?