నాగార్జునకు జోడీగా..!?

కాజల్ అగర్వాల్

అందాల చందమామ కాజల్‌కు అవకాశాలు పెద్దగా లేకున్నా అరుదైన రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తోంది. తండ్రీ కొడుకులకు జోడీగా నటించి మెప్పించిన అరుదైన రికార్డు ఒకప్పుడు శ్రీదేవికి ఉంటే, ఆ తరువాత మళ్లీ కాజలే క్రియేట్ చేసింది. ఏయన్నార్‌తో సినిమాలు చేసిన శ్రీదేవి తరువాత నాగార్జున సరసనా కనిపించి శెభాష్ అనిపించుకుంది. తండ్రీ కొడుకులకు హీరోయిన్‌గా చేసిన రికార్డు ఫస్ట్ శ్రీదేవిదే. అలాంటి రికార్డు తరువాత కాజల్‌కే దక్కింది. రామ్‌చరణ్‌కు జోడీగా మగధీర చేసిన కాజల్, తరువాత చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెం 150లో నటించి మెప్పించింది. శ్రీదేవి రికార్డును సమం చేసిన కాజల్, తాజా ప్రాజెక్టును ఆ రికార్డును అధిగమించనుందని అంటున్నారు. నాగచైతన్య హీరోగా వచ్చిన దడ చిత్రంలో హీరోకి జోడీగా కనిపించిన కాజల్, ప్రస్తుతం నాగార్జున తాజా ప్రాజెక్టుకు జోడీగా ఎంపికైందట. నాగ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ ప్రాజెక్టుకు కాజల్‌ను ఎంపిక చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులకు జోడీగా నటించిన రికార్డు కాజల్ పరమవుతుంది.