మొదటినుంచీ చివరి వరకూ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన తెలుగు సినీనటుల సంఘం (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
దీంతో మా అధ్యక్షుడిగా నరేశ్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల గెలుపొందారు. ఇక్కడ విశేషం ఏమంటే హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మద్దతు ఎవరికీ ఉంటే వాళ్లే గెలుస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ‘మా’కి సంబంధించిన వ్యవహారాల్లో నందమూరి ఫ్యామిలీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వదు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ విషయంలో చిరంజీవినే ఫాలో అవుతుంటారు. ఈసారి కూడా అదే జరిగింది. అయితే ఈ ఎన్నికలో నరేష్ కు అంత భారీ మెజారిటీ రావటం వెనక జరిగిన మ్యాటరేంటనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.
మొదటనుంచీ మెగాస్టార్ చిరంజీవి మద్దతు శివాజీరాజాకి ఉంటుందని భావించారు. కానీ లాస్ట్ మినిట్ లో మొగా కాంపౌండ్ మొత్తం నరేష్ ప్యానెల్ వైపు మొగ్గు చూపింది దెబ్బకొట్టిందంటున్నారు. చిరంజీవి సూచన మేరకు నాగబాబు స్వయంగా ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేయటంతో…. రిజల్ట్స్ నరేష్ కి ఫేవర్ గా వచ్చిందంటున్నారు.
అందుకు కారణం… మహేష్ బాబు.. చిరంజీవికి ఫోన్ చేసి నరేష్ కి మద్దతు తెలపాలని కోరారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. శివాజీరాజాకి వ్యతిరేకంగా చిరంజీవికి చాలా మంది సిని ప్రముఖులు ఫోన్లు చేశారట. దీంతో చిరు తన పూర్తి మద్దతు నరేష్ కి పలికారని తెలుస్తోంది. మొత్తానికి గత కొద్ది రోజులుగా తనపై రకరకాల విమర్శలు చేస్తూ.. అవమానించాలని చూసిన శివాజీరాజాపై నరేష్ విజయం సాధించి పగ తీర్చుకున్నాడని చెప్పుకుంటున్నారు.
ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
‘మా’ అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో తొలి ఓటును నటుడు నరేష్ వేయగా.. చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు.
సినీరంగానికి చెందిన ప్రముఖులంతా ఫిల్మ్‌ఛాంబర్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.