చైనా యువకుల్ని భయపెడుతున్న 996, ఇంతకీ ఇదేంటో తెలుసా?

 

(మల్యాల పళ్ళంరాజు)

మీరు ఐటీ ఉద్యోగులా.. అయితే ఎన్నిగంటలు పని చేస్తున్నారు. సాధారణంగా 8 గంటలు, ఒక్కో సారి 9 లేదా 10 గంటలు అవునా.. ఇంతకీ మీకు చైనా 996 గురించి తెలుసా.. (555 కాదండోయ్.. 996 గురించి) అయితే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

ఐటీ రంగంలోనే కాదు, ఆర్థికవ్యవస్థలోనూ, ఉత్పాదకతలోనూ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అమెరికా, జపాన్ కంటే ముందంజలోదూసుకుపోవాలని, ప్రపంచ నెంబర్ 1 కావాలని చైనా లక్ష్యాలు నిర్దేశించుకుంది. చైనా వరల్డ్ నెంబర్ 1 లక్ష్య సాధనకు ఆ దేశంలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల చేత అత్యధికంగా పని చేయించేందుకు తీసుకు వచ్చిన కొత్త విధానమే 996 నిబంధన . అంటే 9 గంటల నుంచి 9 గంటల చొప్పున.. వారానికి 6 రోజులు పనిచేయడమే ఈ కొత్త విధానం లక్ష్యం.

భారతదేశంలోనే కాదు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణంగా కార్మికులు 8 గంటలపాటు పని చేస్తారు. 150 సంవత్సరాల వరకూ యూరప్, అమెరికా వంటి దేశాల్లో కార్మికులు రోజుకు 12 నుంచి 14 గంటల సేపు పనిచేసేవారు. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు వారానికి 7 రోజులూ పనిచేసేవారు. 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికుల మహోద్యమం తర్వాత పరిస్థితి మారింది. గొడ్డుచాకిరీని తగ్గించాలని, వేతనాలు పెంచాలని నిపుణులైన కార్మికులు పోరాటం సాగించారు. ఆనాడు కార్మికులకు, చికాగో పోలీసులకు మధ్యజరిగిన ఘర్షణ, కార్మికుల బలిదానాలు.. తర్వాత ప్రభుత్వాల ధోరణిలో మార్పు వచ్చాయి. ఆ ఉద్యమం అణచివేతకు గురైనా, కార్మికుల హక్కులు, బాధ్యతలు, కార్మిక చట్టాలపై వివిధ దేశాల ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. 1890 ప్రాంతంలోనే మొదట జర్మనీ స్పందించింది. సగటు పని గంటలను 11కు తగ్గించి, ఆదివారం సెలవు ప్రకటించింది. 1920 నాటికి క్రమంగా పరిస్థితి మారింది. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు వారానికి 48 గంటలు, శనివారం ఒకపూటే(4గంటలు) పనిచేయాలన్న నిబంధనలు అమలులోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కార్మికుల పని భారం మరింత తగ్గింది. వారానికి 40 గంటలు పని చేస్తే చాలు,కార్మికులకు ఆదివారంతో పాటు చట్టబద్ధమైన 20 సెలవు దినాలు కూడా వచ్చాయి. ఫలితంగా కార్మికుల పని సామర్థ్యం హెచ్చింది. ఫలితంగా జపాన్ వంటి చిన్నదేశం ఉత్పాదకతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లను మించి పోయింది. చైనాలో సగటు కార్మికుడు ఏటా 2 వేల నుంచి 2,200 పని గంటలు పని చేస్తే. బ్రిటన్ లోని కంపెనీలలో కార్మికులు ఏడాదిలో 1,677 పని గంటలు మాత్రమే పని చేస్తారని బీజింగ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

సోవియెట్ యూనియన్ పతనం, ప్రపంచ వ్యాప్తంగా కార్మికోద్యమాలు నీరు కారడం, హెచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని కార్పొరేట్ కల్చర్ ప్రబలి పోవడం, ప్రభుత్వాలపై కార్పొరేట్ సంస్థల పైచేయి పెరిగి పోవడంతో దాదాపు అన్నిదేశాల్లో కార్మిక చట్టాలు నిర్వీర్యం అవుతున్న ధోరణులు కన్పిస్తున్నాయి. మనదేశంలోనే జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం పత్రికల్లో ఉద్యోగులు రోజుకు 6 గంటలు పనిచేస్తే చాలు. కానీ, పత్రికా సంస్థల యజమానులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి పెరగడం, ప్రైవేటు ఛానళ్లు పెరిగి పోవడంతో జర్నలిస్ట్ లు 9, తొమ్మిదిన్నర గంటలు కూడా పనిచేయాల్సి వస్తున్నది. అలాగే, కర్మాగారాల్లోనూ, ఐటీ రంగంలోనూ కార్మికుల పని గంటలు హెచ్చాయి. కార్మిక శాఖ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

ఇక చైనా విషయానికి వస్తే, అక్కడా కార్మిక చట్టాల విషయంలో ఇదే ధోరణి. అందుకే చైనాలో విజయవంతంగా నడుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు కొత్తగా 996 అన్ననిబంధనను అమలుకు పూనుకుంటున్నాయి. చైనా దేశపు సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే హంగ్ ఝూ లో ఓ ఐటీ కంపెనీ ఉద్యోగులను రోజూ 9 గంటల నుంచి 9 గంటలవరకూ వారానికి 6 రోజులూ పనిచేయాలని ఉద్యోగులకు మీటింగ్ పెట్టి మరీ స్పష్టం చేసిందట. కొత్త నిబంధన నిజానికి కార్మిక చట్టాల ఉల్లంఘనే. వారానికి 40 పనిగంటలే ఉండాలి. ఆ నిబంధన కాదని, కార్మికుల పని గంటలు పెంచాలంటే, ప్రభుత్వం అనుమతి తప్పని సరి. అయితే, మనదేశం మాదిరిగానే చైనా లోనూ కంపెనీల యజమానులు కార్మిక చట్టాలను పట్టించుకోరు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్న ఐటీ కంపెనీ మాటను అక్కడి ప్రభుత్వం కూడా కాదనే పరిస్థితి లేదు. ఇప్పటికే చైనా, జపాన్ లలోని ప్రైవేటు సంస్థలు 996 నిబంధనను అనధికారికంగా అమలు చేసేస్తున్నాయట. ఉద్యోగులు కూడా ఓవర్ టైమ్ గా వచ్చే భత్యంతో వారాంతంలో పార్టీలు చేసుకుంటున్నారట.

అధిక పనిగంటలు… ప్రాణాంతకం

ఐటీ కంపెనీల్లో 996 వర్క్ నిబంధన వల్ల ఉత్పాదకత హెచ్చి, చైనా ఆర్థిక వ్యవస్థ ఇమ్మడి ముమ్మడిగా అభివృద్ధి పథంలో దూసుకు పోవచ్చు కానీ, వచ్చే అనర్థాలు ఎన్నో… ఉద్యోగులు అధిక గంటలు పని చేస్తే, పని ఒత్తిడి హెచ్చి వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పని వత్తిడి వల్ల 15 ఏళ్ల కాలంలో చైనాలో ఏటా 6 లక్షల మంది కార్మికులు మరణిస్తున్నారని చైనా అధికారపత్రికలే వెల్లడించాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు పనివత్తిడి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. పేద, వలస కార్మికులే కాదు. యూనివర్సిటీ స్థాయిలో విద్యావంతులు కూడా పనివత్తిడికి బలవుతున్నారు. వర్క్ టెన్షన్ కారణంగా ఉద్యోగులు తమ కుటుంబాలతో సరదాగా గడపలేకపోతున్నారు. గంట సేపు టీవీ చూసే తీరికలేని వారెందరో.. పిల్లలతో ఉల్లాసంగా గడపలేని వారెందరో.. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై, విడాకులు అందుకున్న కేసులు ఎన్నో…

పశ్చిమ దేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని వత్తిడిని గుర్తించిన పలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు తగిన జాగ్రత్తలు వహిస్తున్నాయి. వర్క్ కల్చర్ మెరుగుదలకు పలు జాగ్రత్తలు చేపడుతున్నాయి. కొన్ని గంటలు మాత్రం పని చేయండి. కంపెనీలోనే నిబంధనల ప్రకారం 8 గంటలు పూర్తయ్యే వరకూ ఉల్లాసంగా గడపండి అంటున్న కంపెనీలు లేకపోలేదు.

చైనాలో 996 పనిగంటల ప్రతిపాదన చేస్తున్న హంగ్ ఝూ కంపెనీ మాత్రం కార్పొరేట్ కల్చర్ లో భాగంగానే కొత్త ప్రతి పాదన చేస్తున్నామని, ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి విఘాతం కల్గించడం తమ ఉద్దేశం కాదని, సన్నాయి నొక్కులు నొక్కుతున్నదట. కుటుంబం మద్దతు ఉంటే, ఉద్యోగులకు 996 ప్రతిపాదన అంగీకరించడం సాధ్యమేనని చెప్పుకు వస్తోంది. ఏమైనా, చైనాలో 996 ఆరంభమై, ఐటీ రంగంలో ముందుకు దూసుకు పోతే, ప్రపంచంలో మిగతా దేశాలు ,ఐటీ కంపెనీలు ఇదే పద్ధతి అనుసరించవచ్చు.

 

( మల్యాల పళ్ళంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ , 9705347795)