ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్ తన హయాంలో తలపెట్టిన కార్యక్రమాల్లో ఒక పని అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఆయన కోరుకున్న దానికంటే ఎక్కువే పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆ కార్యక్రమం ఏమిటంటే?…ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయాలనే లక్ష్యంతో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమం. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక పనుల్లో ఈ కార్యక్రమం అతి సామాన్యుల నుంచి మేధావుల దాకా అందరి మన్ననలనూ పొందుతోంది…ఒక్క పచ్చమీడియా అభినందనలు తప్ప…ఇప్పుడదే వారిని మరింత ఈసడించుకోవడానికి కారణమవుతోంది.
జగన్ బృహుత్తర కార్యక్రమం…
విద్య అనేది వ్యక్తి అభివృద్దికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , సమాజ పురోగతికి బలమైన పునాది లాంటిది. భారతదేశంలో ఒకప్పటి ప్రభుత్వాలు విద్యాభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి దాతల సహకారంతో పనులు పూర్తిచేసేవి. అయితే ఆ తరువాత ఎప్పుడయితే ప్రైవేట్ విద్య, కార్పొరేట్ విద్య ప్రవేశించాయో ఇక అప్పటి నుంచి క్రమంగా సర్కారు స్కూళ్లు పడకేయడం ప్రారంభించాయి. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా లేక మార్పు అనివార్యమనే చందంగా జరిగిందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఏదేమైనా తత్ఫలితంగా విద్య అనేది అందరికీ ఒకేరకంగా అందని అపురూప వస్తువుగా మారిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా కొత్త పాలకులు ఎందరు వచ్చినా ఎందుకొ తెలియదు గాని విద్యావ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చెయ్యలేదు. అయితే ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి జగన్ ఈ బృహుత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. “నాడు-నేడు” అనే కార్యక్రమం ద్వారా సౌకర్యాల్లోనే కాదు విద్యా బోధనలోను మెరుగ్గా ఉంటూ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని తాపత్రయపడుతున్నారు.
‘నాడు-నేడు’లో…ఏం జరుగుతుందంటే?
ఈ పథకం ద్వారా ప్రతి ప్రభుత్వ స్కూలుకు నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో స్కూళ్ల రూపురేఖలు అందంగా మార్చడంతో సహా మౌలిక సదుపాయాలు, అలాగే క్లాసుల్లో ఫర్నీచర్, మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్మాణ,నిర్వహణ,గ్రీనరీ,ఆట వస్తువుల ఏర్పాటు ఇలా సకల హంగులు ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం రూ.12,000 కోట్లతో మూడు దశల్లో ఈ పనులు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు జరిగేలా చూడాలని నిర్ణయించారు. తొలి దశలో ఇప్పటివరకూ రూ.3,627 కోట్లతో 15,715 స్కూళ్లల్లో 58,559 పనులు పూర్తిచేశారు.
తరువాత దశ పనులకు గ్రీన్ సిగ్నల్
అలాగే రెండవ దశలో రూ.4,732 కోట్లతో 14,584 స్కూళ్లల్లో మౌలిక వసతులు, మూడవ దశలో రూ.2,969 కోట్లతో 16,489 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ఏడాది నవంబర్‌లో రెండో దశ పనులను చేపట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మూడో దశ పనులను వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రారంభించి మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఇవి ఇప్పటికే మారాయి…
ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ది ద్వారా పేద-మధ్య తరగతి విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్ సర్కార్ ప్రతి విషయంలోనూ నూతన మార్పుచేర్పులతో తనదైన ముద్ర కనబరుస్తోంది. విద్యార్ధులకు కొత్త యూనిఫారం పంపిణీ దగ్గర్నుంచి పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్చడం వరకూ పలు వినూత్న మార్పులు చేశారు. మధ్యాహ్న భోజనంలో ఏడు రోజులు ఏడు రకాల వంటకాలతో పాటు ప్రతీరోజు ఒక స్వీటును అందించాలని నిర్ణయించారు.
ఉదాహరణకు ఒక స్కూలు ‘నాడు-నేడు’
నాడు-నేడు కార్యక్రమం అభివృద్ది ఎలా జరిగిందనేది మచ్చుకు ఒక స్కూలు ఉదాహరణగా చూద్దాం..ఇది పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల. ఇక్కడ దాదాపు 350 మంది పిల్లలు చదువుతున్నారు. నాడు-నేడులో పథకం కింద ప్రభుత్వం ఈ స్కూలును ఎంపిక చేసి అభివృద్ది కోసం రూ. 71 లక్షలు కేటాయించింది. వీటితో ఆ స్కూల్లో విశాలమైన క్లాస్ రూములు, గ్రానైట్ ఫ్లోరింగ్, మోడరన్ టాయిలెట్స్, విద్యార్ధులు కూర్చోడానికి లేటెస్ట్ మోడల్ టేబుల్స్, విశాలమైన ప్రేయర్ హాల్, స్కూల్ లో సరస్వతి విగ్రహం ఏర్పాటు, ప్లే గ్రౌండ్ ఆధునీకరణ, గోడలపై పేర్లతో సహా రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రాజెక్టులు, పక్షుల బొమ్మలు చిత్రీకరణ ఇలా ఈ ప్రభుత్వ పాఠశాలను ఓ చక్కటి మోడల్ స్కూల్ గా మార్చేశారు.
జగన్ మాట అదే…నేడు తల్లిదండ్రుల బాట ఇదే
ప్రభుత్వం విద్య కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా పేదలు అప్పులు చేసి మరీ ప్రయివేటు స్కూళ్లల్లో విద్య కోసం ఎందుకు పరుగులు పెడుతున్నారనే ఆలోచనతో జగన్ ‘నాడు-నేడు’ కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని, అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశం పెట్టడం అని అంటారు. అమ్మ ఒడి డబ్బులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితి ఉండకూడదనేది ఆయన అభిమతంగా చెబుతారు. ఆయన కోరుకున్నవిధంగానే ఒక్కో స్కూల్ లో వస్తున్న మార్పు తల్లిదండ్రుల హృదయాల్లోనేూ మార్పు తీసుకొస్తోంది. ఈ స్కూళ్ల అభివృద్ది చూసి తాము ఈ బడి బాట పట్టడమే కాదు మిగతా వాళ్లకు కూడా చెబుతాం అంటున్నారు తల్లిదండ్రులు.
పచ్చమీడియాకు పట్టదా?
మంచిపని ఎవరు చేసినా మెచ్చుకోవాలని నానుడి…మరి జగన్ పట్ల ఎంత అయిష్టత అయినా ఉండొచ్చు కానీ సర్కారు పాఠశాలలను సంస్కరించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను పచ్చ మీడియా పట్టించుకోకపోవడం దారణమంటున్నారు విద్యావేత్తలు, మేధావులు. సమాజ పురోభివృద్దికి ఎంతగానో తోడ్పడే ఇలాంటి ప్రయత్నాలను మెచ్చకోవడం, ప్రోత్సహించడం అభివృద్ది కాముకులు విధిగా చేయాలని…అయితే ఇలాంటి పనుల్లో కూడా లోపాలే చూస్తూ ఎండగట్టాలని ప్రయత్నిస్తే అది నీచమని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం…ఈ పాఠశాలల అభివృద్దిపై తల్లిదండ్రుల అభిప్రాయాలను చూసైనా ఎల్లో మీడియా మారుతుందేమో!