ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు కొనసాగేనా?

 

(యనమల నాగిరెడ్డి)

 

దేశంలో ఉన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలలో మోడీతో కలసి చక్రం తిప్పాలన్న ఆలోచనతోనూ, 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో గెలడానికి  చంద్రబాబు బీజేపీతో చెలిమి చేశారు. ప్రస్తుతం మారిన జాతీయ రాజకీయ పరిస్థితి, కొంతమేరకు పుంజుకున్న కాంగ్రెస్ బలం, తగ్గిన మోడీ ప్రభ, దెబ్బతిన్న తన ప్రయోజనాలు కారణాలుగా  చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. మారుతున్న జాతీయ రాజకీయాలు, మోడీతో తనకున్నఅభిప్రాయభేదాలు, ఇబ్బందుల కారణంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ స్నేహ హస్తం అందుకున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ మిత్ర పక్షాలను  కలవడంతో పాటు, కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలను కూడా ఒకే గొడుగు క్రిందకు తేవడానికి తీవ్రంగా కృషి చేశారు. చంద్రబాబు ఇపుడు కూడా అవే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అందులో భాగంగానే తెలంగాణలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో పెద్దన్న కాంగ్రెస్ కు టీడీపీతో పాటు చిన్నా, చితకా పార్టీలను జత చేసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పరిస్థితికి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితికి పూర్తి సారూప్యత ఉంది.  తెలంగాణలో అంపశయ్యపై టీడీపీ ఉండగా ఏపీలో అదే స్థితిలో కాంగ్రెస్ ఉంది. అయితే కాంగ్రెస్ ను మట్టి కురిపించడం కోసం పుట్టి, పెరిగిన టీడీపీ- కాంగ్రెస్ తో కలవడాన్ని తెలంగాణాలో రెండు పార్టీల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణా ఎన్నికలలో తెరాస చేతిలో చావు దెబ్బ తిన్నారు. మహాకూటమికి ప్రత్యేకించి చంద్రబాబుకు ఆ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.  

 ఆంధ్రలో పొత్తు ఎలా ఉంటుంది?

అయితే ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికలలో ఈ కూటమి కొనసాగుతుందా? లేక కాంగ్రెస్ టీడీపీ పొత్తు మాత్రమే ఉంటుందా? అన్న అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది.

“రాష్ట్రానికి ప్రత్యేక హోదా, చంద్రబాబు  ప్రస్తావిస్తున్న ఇతర అంశాలు, గురువారం కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ప్రసంగం కలిపి చూస్తే టీడీపీ కాంగ్రెస్ పొత్తు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి”. అయితే ఈ రెండు పార్టీలు మాత్రమే కలసి పోటీ చేస్తాయా? లేక కలసి వచ్చే మరికొన్ని పార్టీలను కలుపుకుంటారా? అన్న అంశం చంద్రబాబు రాజకీయమే  తేల్చవలసి ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ  పరిస్థిని గమనిస్తే టీడీపీ- కాంగ్రెస్ పొత్తు వల్ల రెండు పార్టీలకు ఏంతో  కొంత మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 లో రాష్ట్ర విభజన సందర్భంగా తమ మనోభావాలను  పట్టించుకోలేదని ఆగ్రహించిన రాయలసీమ, ఆంధ్ర జనం ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఇక్కడ భూస్థాపితం  చేశారు. అప్పటి నుండి ఏపీలో పార్టీకి ఊపిరి పోయగలిగిన నాయకుడు లేకపోవడం, ఉన్న నాయకులు కూడా అడపాదడపా పత్రికా ప్రకటనలకే పరిమితమై కార్యకర్తలలో నైతిక స్తైర్యాన్ని పెంచడంలో విఫలం కావడం తో .పార్టీ స్థితిగతులు పూర్తి అద్వాన్నంగా మారాయి.

రాజశేఖర్ రెడ్డి మరణంతో కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారపీఠం ఎక్కాలనుకున్న జగన్మోహన్ రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని , ఏపీలో కాంగ్రెస్ అధోగతి పాలు కావడానికి కూడా అదే కారణమని  కాంగ్రేస్ అధి నాయకత్వం నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు అభిప్రాయపడింది. ఆమేరకు జగన్ పై వ్యతిరేకత పెంచుకున్నారు నాయకులు. అప్పట్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి, వైస్సార్ పార్టీలో చేరిన 18 మంది శాసన సభ్యులను రాజీనామా చేయించిన జగన్ వారికి వైస్సార్ పార్టీ టిక్కెట్లు ఇచ్చి  ఉపఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. . ఆ తర్వాత జరిగిన కడప పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆయన స్వయంగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

వైఎస్ ఆర్ సి దెబ్బతీయగలరా?

2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి చేతిలో  అతి తక్కువ తేడాతో ఓడిపోయి జగన్ అధికార  పీఠం కోల్పోయారు.  ఆ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నకాంగ్రెస్  అప్పటి నుండి కుంటినడక నడుస్తూ  వైస్సార్ కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరుతున్నది.  వైస్సార్ కాంగ్రెస్ ను దెబ్బ తీసి తమ పూర్వవైభవం పొందాలని కలలు కంటున్నారు.

అదే సమయంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికార పీఠం అధిష్టించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో అందరికీ అనేక వాగ్దానాలు చేసి ఆతర్వాత  అరచేతిలో వైకుంఠం చూపారు. (ఇప్పటికీ అదే పంధాలో పని చేస్తున్నారు). ఐతే తాను చేసిన తప్పులకు, తాను నెరవేర్చలేని వాగ్దానాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ పబ్బం గడుపు కోవాలని ఆయన యత్నిస్తున్నారు.  గత  ఎన్నికలలో చంద్రబాబు-బీజేపీ-జనసేన తో కలిసి పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో అధికార పీటం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో  బాబు తెగతంపులు చేసుకోవడంతో వారి ఓట్లు కూడా టీడీపీకి దక్కే పరిస్థితి లేదు.  సాధారణంగా అధికార పార్టీకి ఉండే వ్యతిరేకత కూడా దీనికి తోడుగా చేరింది. ఇదే సమయంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లడం వల్ల  ఆయనకు కాలం పూర్తి అనుకూలంగా మారిందని జనాభిప్రాయం.

రాజకీయ ఎత్తుగడలలో తలపండిన చంద్రబాబు (40 ఇయర్స్ ఇండస్ట్రీ) “ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని”  కాంగ్రెస్ తో పొత్తు కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు భావించవలసి వస్తున్నది. కాంగ్రెస్ అభిమానులు రాష్ట్రంలో ఇప్పటికీ చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు కలిస్తే నష్టపోయిన ఓట్లలో కొంత మేరకు భర్తీ చేసుకోవచ్చునని చంద్రబాబు ఆశపడ్తుంటే  , జాతీయస్థాయిలో చంద్రబాబు మధ్యవర్తిత్వం అవసరం అవుతుందని, అలాగే రాష్ట్రంలో అంపశయ్యపై చేరిన కాంగ్రెస్ కు ఊపిరి పోయవచ్చునని కాంగ్రెస్ స్కెచ్ లాగా ఉంది. ఇలా వైసిపిని దెబ్బతీసేందుకు ప్లాన్ వేస్తున్నారు.

ఐతే తెలంగాణా లో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఏపీలో చిన్నన్నగానూ, టీడీపీ పెద్దన్నగాను మారగలరు. సీట్ల సర్దుబాటు విషయంలో ఈ సారి కాంగ్రెస్ సంయమనం పాటించి  టీడీపీ దయతో ఇచ్చిన సీట్లలోనే పోటీ చేయాల్సింటుంది. 

ఆంధ్రలో జాతీయ ఫ్రంట్ కొనసాగింపు?

జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే ఫ్రంట్ లో కాషాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సిపిఐ, సిపిఐ(ఎం) తప్పకుండా చేరడానికి అవకాశం ఉందని, అవే  పొత్తులను టీడీపీ- కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సిపిఐ, సిపియం పార్టీలకున్న కార్యకర్తల బలం  టీడీపీ-కాంగ్రెస్ కూటమికి అదనపు బలం కాగలదని బాబు గారు అంచనా వేస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు ఎన్నికలలో ఎలా వ్యవహరిస్తాయో  చూడాలి.

ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ -కాంగ్రెస్ కలసి జంటగా పోటీ చేస్తాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  ఈ పరిణామాలపై జనం ఎలా స్పందిస్తారో? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? వచ్చే ఎన్నికలవరకు ఎదురు చూడాల్సి ఉంది.