చిరంజీవి బీజేపీలోకి వెళ్ళబోతున్నారా.?

నిన్న ఢిల్లీకి వెళ్ళారు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి. తన కుమారుడు రామ్ చరణ్ ఆస్కార్ పురస్కారాల వేడుకలో పాల్గొని ఇండియాకి తిరిగొచ్చిన నేపథ్యంలో పుత్రోత్సాహంతో ‘స్వాగత ఏర్పాట్ల’ నిమిత్తం చిరంజీవి ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్ళడమెందుకు.? హైద్రాబాద్‌లో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటే సరిపోయేది కదా.? అన్న వాదనా లేకపోలేదు.

కానీ, తెరవెనుకాల పెద్ద కథే వుంది. బీజేపీ అధినాయకత్వం చిరంజీవిని ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రత్యేకంగా చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడి, ఢిల్లీకి పిలిపించుకున్నారట. అయితే, ఈ విషయమై మెగా కాంపౌండ్ నుంచి పూర్తి స్థాయి ‘సైలెన్స్’ కనిపిస్తోంది.

చిరంజీవి, రామ్ చరణ్.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో భేటీ అయ్యారు. నిజానికి, ప్రధానితోనూ భేటీ జరగాల్సి వుందట. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ భేటీ రద్దయ్యిందన్నది ఓ వాదన. త్వరలో ఇంకోసారి చిరంజీవి, చరణ్.. ఢిల్లీకి వెళ్ళే అవకాశం వుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు త్వరలో ప్రధాని మోడీ వస్తారనీ, ఆ సందర్భంలో చిరంజీవి, చరణ్ ఆయన్ని కలిసే అవకాశం వుందనీ ఇంకో వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే, బీజేపీలోకి చిరంజీవిని చాలాకాలంగా ఆహ్వానిస్తూ వున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. కానీ, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ప్రచారం కోసమైనా సహకరించాలని చిరంజీవినీ, చరణ్‌నీ బీజేపీ పెద్దలు కోరుతున్నారన్నది తాజా ఖబర్. కానీ, బీజేపీలో చిరంజీవి చేరబోతున్నారన్న ప్రచారమైతే గతంలో కన్నా చాలా గట్టిగానే వినిపిస్తోంది మరి.!